కవాడిగూడ, జూన్ 15: కామారెడ్డిలో కాం గ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీ మేరకు తక్షణమే సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. లేదంటే బీసీ సంఘాలన్నింటినీ కలుపుకొని రాష్ట్ర వ్యా ప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నదని మండిపడ్డా రు.
శనివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో బీ సీ కుల సంఘాల ఐక్య వేదిక, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తివేస్తామని చెప్పి దేశవ్యాప్తంగా ఎక్కువ సీట్లు గె లుచుకున్నారని చెప్పారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించకుండానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కుట్రపన్నుతున్నదన్నారు.
నష్టం చేస్తే ఊరుకోం : ఆర్ కృష్ణయ్య
బీసీ సఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా దేశ పాలకులు బీసీలను బిచ్చగాళ్లను చేశారని, బీసీల ఓట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నష్టం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాహుల్ గాంధీ మాటను గౌరవించి బీసీ జనాభా ప్రకారం అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కమిషన్ నివేదికలు బుట్టదాఖలు: ఆర్ఎస్పీ
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ కృ షితోనే రాజ్యాంగంలో బీసీ కమిషన్లు వేసుకు నే అవకాశం వచ్చిందని, నెహ్రూ నాయకత్వం లో కాకా కలేల్కర్ కమిషన్ నివేదిక, ఇందిర నాయకత్వంలో మండల్ కమిషన్ నివేదికను బుట్టదాఖలు చేశారని గుర్తుచేశారు.
మండల్ కమిషన్ అమలు చేసిన వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వం మద్దతు ఉపసంహరించుకోగా రాజీవ్‌గాంధీ వ్యతిరేకించారని చె ప్పారు. చట్టాలు, న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకొని బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. నేటికీ 79 శాతం న్యాయమూర్తులు ఆధిపత్య వర్గాల వారే ఉన్నారని తెలిపారు. 46, 340 ఆర్టికల్స్ ప్రకారం బీసీల హక్కులను సాధించాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, ఆలిండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, మేకల కృష్ణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణ కుమార్, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్లు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తం, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్, బీఆర్ఎస్ నాయకుడు ముఠా జైసింహ, ఎంబీసీ నాయకుడు కొల్లూరి సత్యనారాయణ, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే, వల్లాల జగన్ గౌడ్, పొన్నం మహేశ్ గౌడ్, న్యాయవాది రాచకొండ ప్రవీణ్ కుమార్, హైకోర్టు న్యాయవాది గుండ్రాతి శారద గౌడ్, అంబాల నారాయణ గౌడ్ పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం బస్సుయాత్ర
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల మూడోవారంలో బస్సుయాత్ర చేపడుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19న హైదరాబాదులో ‘సమగ్ర కులగణన సవాళ్లు-స్వతంత్ర కమిషన్ ఏర్పాటు, బీసీ రిజర్వేషన్ల పెంపు’ అన్న అంశంపై బీసీ మేధావులతో బీసీల మేధోమథన సమావేశాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కులగణన సర్వే కోసం తక్షణమే స్వతంత్ర కమిషన్‌ను నియమించాలని, బీహార్ తరహలోనే సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం, బీసీ సంక్షేమశాఖ మంత్రి తక్షణమే జోక్యం చేసుకొని జాప్యం లేకుండా బీసీ కులగణన చేపట్టేలా చర్యలు చేపట్టి, తమ హామీని నిలబెట్టుకోవాలని కోరారు.