హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఎన్ని పథకాలు అమలయ్యాయి. ఇంకా అమలు చేయాల్సింది ఎన్ని? అని నిలదీశారు. హామీలపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రవీందర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటి అమలులో నిర్లక్ష్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. హామీల గురించి ప్రశ్నించిన వారిపై నిర్బంధం కొనసాగిస్తున్నారని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇప్పటికే రెండు బడ్జెట్లు పూర్తయ్యాయని, దాదాపు 40 శాతం బడ్జెట్ పూర్తయిందని, ఇంకా హామీలను ఎప్పుడు అమలు చేస్తారని నిలదీశారు. ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒకటో, రెండో అరకొరగా అమలు చేసి కాంగ్రెస్ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని విమర్శించారు. అదే కేసీఆర్ హయాంలో చెప్పిన హామీలతోపాటు చెప్పని ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేసి చూపించారని చెప్పారు. సీఎం రేవంత్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విమర్శించారు. ఉద్యమ సమయంలోనే తెలంగాణ ప్రాంత నీటి వాటా గురించి అడిగారని, ఇంకా గోడలపై టీఆర్ఎస్ రాతలు అలాగే ఉన్నాయని గుర్తుచేశారు.
ఆనాడే.. తెలంగాణను ఆంధ్రాతో కలిపి కాంగ్రెస్ ద్రోహం చేసిందని, నీళ్ల విషయంలోనూ అదే ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. ఉరి తీయాల్సింది తెలంగాణకు ద్రోహం చేసిన వారిని అని, ఉద్యమంలో తెలంగాణ యువతను చంపిన కాంగ్రెస్‌నే ఉరి తీయాలని ఆయన ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు సిద్ధకావాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. హామీలపై మాట తప్పి, మడమ తిప్పి, నేడు సంబురాలు జరుపుకోవడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన కేసీఆర్.. దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దారని కొనియాడారు.
42% రిజర్వేషన్లు అమలు చేయాలి: శ్రీనివాసగౌడ్
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని, ఆలోగా రిజర్వేషన్లను ఎలా చేస్తారని ప్రశ్నించారు. బీసీ బిల్లు ఆమోదం కోసం కేంద్రానికి పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని, ఆ తర్వాత ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీనిపై అఖిలపక్షాన్ని ఎందుకు ఢిల్లీకి తీసుకెళ్లడం లేదని మండిపడ్డారు. ప్రధాని మోదీని కలిసినప్పుడు ఈ బిల్లు గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దేవుడి లాంటి కేసీఆర్‌ను తిట్టడమే రేవంత్ పనా? ఆయన తెలంగాణ తేకుంటే.. రేవంత్ సీఎం అయ్యేవాడా? అని నిలదీశారు. సమావేశంలో బీఆర్ఎస్ నేత సుమిత్రా ఆనంద్ పాల్గొన్నారు.