వారం క్రితం కోకాపేట భూముల వేలం కేక పుట్టించగా.. తాజాగా బుద్వేల్లోనూ ప్రభుత్వ భూములకు అనూహ్య ధర దక్కింది. 100.01 ఎకరాలకు హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో గరిష్ఠంగా ఎకరా 42 కోట్లు ధర పలికింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్లో నగరం వెలుపల భూములకూ భారీ ధర దక్కుతున్నది. గురువారం నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 3,626 కోట్ల ఆదాయం హెచ్ఎండీఏకు దక్కింది. ప్రభుత్వ నిర్దేశిత ధర కన్నా ఇది 181శాతం ఎక్కువ.
Budvel auction | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగారూపుదిద్దుకుంటున్న హైదరాబాద్లో భూముల ధరలు నగరం నడిమధ్యనే కాదు శివారు ప్రాంతాల్లో సైతం బంగారాన్ని మించిపోతున్నాయి. వారం క్రితం కోకాపేటలో ఎకరం భూమి వంద కోట్లు పలుకగా తాజాగా నగరం వెలుపల బుద్వేల్లో దాదాపు రూ.42 కోట్లు పలికింది. వందెకరాల విస్తీర్ణంలోని పద్నాలుగు ప్లాట్లకు గురువారం జరిగిన ఈ-వేలంలో దిగ్గజ కంపెనీలు పోటీపడ్డాయి. కొందరు అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించినప్పటికీ.. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ సరాసరిన నిర్దేశిత ధర కంటే 181 శాతం ఎక్కువకు కంపెనీలు భూములను దక్కించుకున్నాయి. బుద్వేల్ భూముల ద్వారా రెండువేల కోట్ల ఆదాయం వస్తుందని హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేయగా.. దాన్ని తలదన్నేలా రూ.3,625.73 కోట్లు రావడం విశేషం.
బుద్వేల్లో హెచ్ఎండీఏకు చెందిన భూములకు అధికారులు ఈ-వేలం నిర్వహించారు. సుమారు 182 ఎకరాల్లో 17 ప్లాట్లతో హెచ్ఎండీఏ ఇక్కడ భారీ లేఅవుట్ను రూపొందించింది. 100.01 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 14 ప్లాట్లకు మొదటి విడతగా ఈ-వేలం నిర్వహించారు. నిర్దేశిత కనీస ధర ఎకరాకు రూ.20 కోట్లుగా నిర్ధారించి చేపట్టిన ఈ-వేలంలో అనేక కంపెనీలు పోటీపడ్డాయి. 3.47 ఎకరాలు మొదలు 14.33 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో వేలం నిర్వహించారు. ఉదయం సెషన్లో 58.11 ఎకరాల విస్తీర్ణంలోని ఏడు ప్లాట్లలో విస్తీర్ణం అధికంగా ఉన్న నాలుగో నెంబరు ప్లాటు అత్యధికంగా ఎకరాకు రూ.39.25 కోట్ల ధర పలికింది. ఎనిమిది, పదో నెంబరు ప్లాట్లు ఎకరాకు రూ.35.50 కోట్ల ధర పలకగా.. మిగిలినవి కూడా రూ.33-34 కోట్ల మధ్యనే అమ్ముడుపోయాయి. మొదటి సెషన్లోనే రూ.2,057.67 కోట్లు వచ్చింది. రెండో సెషన్లో 41.90 ఎకరాల విస్తీర్ణంలోని మిగిలిన ఏడు ప్లాట్లకు అధికారులు వేలం నిర్వహించారు. ఏడింట్లో మూడు ప్లాట్లు రూ.40 కోట్ల మార్కును దాటాయి. గరిష్ఠంగా 15వ నంబరు ప్లాటు ఎకరా 41.75 కోట్లు పలకగా, కనిష్ఠంగా 14వ నంబరు ప్లాటు 33.75 కోట్లు పలికింది. రెండో సెషన్లో రూ.1,568.06 కోట్ల ఆదాయం వచ్చింది. రెండు సెషన్లలో కలిపి సరాసరిన ఎకరా 36.25 కోట్ల వరకు అమ్ముడుపోయింది. మొత్తం 100.01 ఎకరాలకు హెచ్ఎండీఏకు 3,625.73 కోట్ల ఆదాయం వచ్చింది. వేలంలో హైదరాబాద్ సహా బెంగళూరు, ముంబైకి చెందిన దిగ్గజ కంపెనీలు పోటీ పడ్డాయి.
గతంలో కంపెనీలు తాము స్వాధీనం చేసుకున్న భూముల్లో కొండలు, గుట్టలు, రాళ్లు, తుప్పలు దర్శనమిచ్చేవి. కానీ హెచ్ఎండీఏ లే అవుట్లను అద్భుతంగా అభివృద్ధి చేసి పారదర్శకంగా వాటికి వేలం నిర్వహిస్తున్నది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి టీఎస్ ఐ-పాస్ ద్వారా త్వరితగతిన అనుమతులు రానుండటంతో కంపెనీలు పోటీపడి మరీ ఇక్కడి భూములను దక్కించుకుంటున్నాయి. బుద్వేల్ భూములకు సంబంధించి గురువారమే హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాదులు కోర్టులో బలమైన వాదనలు వినిపించగా, భూముల వేలంపై స్టే ఇవ్వాలన్న విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. ఈ వివరాలను హెచ్ఎండీఏ అధికారులు బిడ్డర్లకు అందుబాటులో ఉంచడంతో బిడ్డర్లు ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నారు.