స్కాంగ్రెస్ కరెన్సీ లీల బట్టబయలయ్యింది. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ తాను అధికారంలో ఉన్న రాష్ర్టాల నుంచి కట్టలకొద్దీ డబ్బును తెలంగాణకు పారిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం రాత్రి బెంగళూరులో ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భారీ మొత్తంలో కరెన్సీ కట్టలు పట్టుబడ్డాయి. తెలంగాణలో ఓటర్లకు పంచేందుకు కాంగ్రెస్ ఆ డబ్బును సిద్ధం చేసిందని సమాచారం. వీటిని కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు ఖండించకపోవటం గమనార్హం. మరో గంటలో హైదరాబాద్‌కు బయలుదేరాల్సిన సొమ్ము ఐటీ చేతికి చిక్కటంతో కాంగ్రెస్ నేతలు తేలుకుట్టిన దొంగల్లా గప్‌చుప్ అయిపోయారు.తెలంగాణ ఓటర్లారా తస్మాత్ జాగ్రత్త! కాంగ్రెస్‌కు ఓటేస్తిరా.. రేపు మన తెలంగాణ సంపద కూడా ఇలాగే కాంగ్రెస్ రాజకీయాల కోసం ఢిల్లీకి, ఇతర రాష్ర్టాలకు తరలిపోవడం ఖాయం.
Congress | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): గురువారం (12-10-2023) సాయంత్రం 6 గంటల సమయం.. బెంగళూరులోని ఆదాయం పన్ను విభాగం ఆఫీస్‌లో ఫోన్ మోగింది. పనులు ముగించుకొని ఇండ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న అధికారుల్లో ఒకరు ఫోన్ ఎత్తి హలో చెప్పండి అన్నాడు. సార్.. సుల్తాన్‌పాళ్య ప్రాంతంలోని ఆత్మానంద కాలనీలో ఓ ఇంట్లో కట్టకొద్దీ డబ్బు ఉన్నది. మీరు ఇప్పుడే వెళ్తే పట్టుకోవచ్చు. ఇంకో గంట ఆలస్యమైతే ఆ డబ్బంతా రాష్ట్రం దాటి వెళ్లిపోతుంది అని అవతలి వ్యక్తి ఆతృతగా చెప్పడు. వారం రోజులుగా రాష్ట్రంలో వరుస సోదాలు నిర్వహిస్తున్న ఐటీ విభాగానికి రోజూ ఇలాంటి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇది కూడా ఓ సాధారణ ఫోన్‌కాల్ అనుకున్నాడు అధికారి. యథాలాపంగా ఆ ఇంటి అడ్రస్‌తోపాటు మరికొన్ని వివరాలు కనుక్కొని ఫోన్ పెట్టేశాడు. మహా అయితే ఆ ఇంట్లో ఏ కోటో, రెండు కోట్ల రూపాయలో ఉండొచ్చులే అనుకొన్నాడు. కానీ, ఫోన్ చేసిన వ్యక్తి కచ్చితంగా, నమ్మకంగా చెప్పటంతో అనుమానం వచ్చి ఆలస్యం చేయకుండా తన టీంతో కలిసి 15 నిమిషాల్లోనే ఆ ఇంటికి చేరుకొని సోదాలు మొదలు పెట్టారు.
స్కాంగ్రెస్ కరెన్సీ లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకొని గెలువలేమని తేలిపోవటంతో పచ్చనోట్లతో ప్రజల కండ్లకు గంతలు కట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల నుంచి గుట్టలకొద్దీ డబ్బు తెలంగాణకు వరదలా పారిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం రాత్రి బెంగళూరులో ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో పట్టుబడిన డబ్బే ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు. తెలంగాణలో ఓటర్లకు పంచేందుకు కాంగ్రెస్ పార్టీ ఆ డబ్బును సిద్ధం చేసిందని వార్తలు వస్తున్నాయి. వీటిని కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు నేరుగా ఖండించకపోవటం గమనార్హం. మరో గంటలో హైదరాబాద్‌కు బయలుదేరాల్సిన సొమ్ము ఐటీ అధికారుల చేతికి చిక్కటంతో కాంగ్రెస్ నేతలు తేలుకుట్టిన దొంగలా గప్‌చుప్ అయిపోయారు.
అసలేం జరిగిందంటే?
పంచాయతీ ఎన్నికలతో పాటు, ఐదు రాష్ర్టాల ఎన్నికలకు అక్రమ సొమ్మును తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో కర్ణాటకలోని పలువురు కాంట్రాక్టర్లు, ఆభరణాల షాపుల యజమానులు, రాజకీయ నాయకుల ఇండ్లల్లో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరులో సుల్తాన్‌పాళ్య ప్రాంతంలోని ఆత్మానంద కాలనీలో ఉన్న ఓ ఇంట్లో పెద్దమొత్తంలో అక్రమ సొమ్ము దాచిపెట్టారని ఐటీ అధికారులకు ఓ వ్యక్తి సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకొన్న అధికారులు ఆ ఇంట్లోని ఓ గదిలో 23 అట్టపెట్టల్లో రూ.42 కోట్ల అక్రమ నగదును గుర్తించారు. కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. సొమ్ము దొరికిన ఇల్లు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అఖండ్ శ్రీనివాసమూర్తి సోదరి అశ్వతమ్మది. ఆమె భర్త అంబికాపతికి బృహన్ బెంగళూరు మహానగర పాలికె కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ పెద్దలు ప్రతి టెండర్లోనూ 40 శాతం కమీషన్ తీసుకొంటున్నారని ఆరోపించి వార్త ల్లో నిలిచిన వ్యక్తి ఈయనే. అశ్వతమ్మ మాజీ కార్పొరేటర్ కూడా. డబ్బు విషయమై అంబికాపతిని, అశ్వతమ్మను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారి వ్యాపార, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారికి సంబంధించిన ఐదుకు పైగా ప్రాంతాల్లోని ఇండ్లు, కార్యాలయాల్లో శుక్రవారం కూడా సోదా లు నిర్వహించారు. ప్రస్తుతం ఈ కేసు ఐటీ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కి బదిలీ చేసినట్టు సమాచారం.
తాళం చెవి లేదంటూ
సోదాల సమయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. డబ్బు ఐటీ అధికారుల కంట పడకుండా కాపాడుకొనేందుకు ఇంట్లోనివారు విశ్వప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. వాస్తవానికి డబ్బు దొరికిన ఫ్లాట్ అంబికాపతిది అయినప్పటికీ, ఆయనకు వరుసకు సోదరుడయ్యే వ్యక్తి అందులో ఉంటున్నాడు. సోదాల కోసం అధికారులు రాగానే బెంబేలెత్తిపోయిన ఆ వ్యక్తి.. వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్టు సమాచారం. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి వెళ్లి సోదాలు మొదలుపెట్టిన అధికారుల బెడ్రూంకు తాళం వేసి ఉండటా న్ని గమనించారు. ఇంట్లో మనుషులుండగా బెడ్రూంకు తాళం ఎందుకు వేశారని నిలదీయటంతో ఆ వ్యక్తి నీళ్లు నమిలాడు. తాళం తీయాలని అధికారులు ఆదేశించటంతో తనవద్ద లేదని, డ్రైవర్ వద్ద ఉన్నదని బదులిచ్చాడు. ఆశ్చర్యపోయిన అధికారులు యజమాని ఇంటి పడకగది తాళం చెవులు కారు డ్రైవర్ వద్ద ఉండటమేమిటని నిలదీశారు. అప్పుడే ఐటీ అధికారులకు ఇక్కడే పెద్ద వ్యవహారమే ఉన్నదని అనుమానం వచ్చింది. ఆయన పొంతనలేని సమాధానాలు చెప్తుండటంతో డ్రైవర్‌ను రప్పించి తలుపులు తెరువాలని గట్టిగా ఆదేశించారు. అప్పటికీ ఆ ఇంట్లో ని వ్యక్తి సహకరించకపోవటంతో డ్రైవర్ ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేసి అతన్ని ఇంటికి రప్పించి గది తలుపులు తెరిచారు. అక్కడ ఉన్న డబ్బు గుట్టలను చూసి విస్తుపోయారు.
బెంగళూరు టూ తెలంగాణ వయా చెన్నై
బెంగళూరులో దొరికిన 42 కోట్ల అక్రమ సొమ్ము ను చెన్నై గుండా తెలంగాణకు తరలించడానికి నిందితులు ప్రయత్నించినట్టు స్థానిక మీడియా పేరొన్నది. శేఖర్‌రెడ్డి అనే వ్యక్తిని ఈ పనికి పురమాయించినట్టు తేలింది. కేఏ04ఎన్ఏ5959 నంబర్‌గల కారును ఇందుకోసం వాడుకోవాలనుకొన్నట్టు తెలిసింది. గంటలో డబ్బును తరలించాలని యత్నించగా, ఐటీ అధికారులు వచ్చిపడటంతో కుట్ర బయటపడింది.
ఎవరీ శేఖర్‌రెడ్డి?
అంబికాపతికి అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి శేఖర్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆయన కొనసాగుతున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అంబికాపతితో పాటు పార్టీలోని పలువురు కీలక నేతలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను, నగదు తరలింపు కార్యక్రమాలను ఇతనే నిర్వహిస్తాడని తెలుస్తున్నది.
అక్రమ సొమ్ము ఎలా వచ్చింది?
కర్ణాటకలోని గత బీజేపీ సర్కారు కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమీషన్‌ను వసూలు చేసిందనే ఆరోపణలున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంతకు మించి అన్నట్టు 50 శాతం కమీషన్‌ను వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. ‘ఎలక్షన్ టాక్స్’ పేరుతో డబ్బులు వసూలు చేసి దానిని తెలంగాణకు పంపే కుట్ర జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో అంబికాపతి కీలక పాత్ర పోషించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా లక్షిత వ్యక్తులకు కాంట్రాక్టులు ఇప్పించి.. ఆయా టెండర్లలో 5.5 శాతం నుంచి 50 శాతం వరకు కమీషన్ వసూలు చేసినట్టు వార్తలు వచ్చాయి. బీజేపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన కాంట్రాక్టులకు బిల్లుల విడుదల కోసం కూడా కమీషన్‌ను డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. తాజాగా దొరికిన సొమ్ము అలాగే వచ్చినట్టు అనుమానిస్తున్నారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లు, వ్యాపారుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తున్నది. కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా అంబికాపతి, ఆయన సన్నిహితుడు కెంపన్న అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో ఈ కమీషన్ వ్యవహారం బయటకు పొక్కలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇది బీజేపీ కుట్రే: డీకే శివకుమార్
చివరి నిమిషయంలో ప్లాన్ బెడిసికొట్టడంతో కర్ణాటక ప్రభుత్వ పెద్దలు రగిలిపోతున్నట్టు సమాచారం. ‘ఈ డబ్బుతో తమకు సంబంధం లేదు’ అని ఏ కాంగ్రె స్ నేతా ప్రకటించలేదు. డిఫ్యూటీ సీఎం డీకే శివకుమా ర్ ఆ డబ్బు తమదేనని పరోక్షంగా అంగీకరించేలా మాట్లాడారు. ‘బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉ న్న రాష్ర్టాల్లో ఇలాంటి ఘటనలు సహజం. బీజేపీ అధికారంలో ఉంటే సోదాలే జరుగవు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాపై చిటపటలాడారు. ‘ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు మేం డబ్బు తరలిస్తున్నామని చూశారా? బీజేపీవాళ్లు చూశారా? మమ్మల్ని ఏ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కూడా డబ్బు పంపాలని అడగలేదు. అడిగినట్టు మీరేమైనా చూశారా?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బెడ్రూంలో బెడ్ కింద చాలా అట్టపెట్టెలు కనిపించటంతో తెరిచి చూసిన అధికారులు బిగుసుకుపోయారు. ఎటు చూసినా డబ్బే.. ఏ పెట్టెలో చూసినా రూ.500 నోట్ల కట్టలే. వాటిని చేత్తో లెక్కపెట్టడం సాధ్యకాదని మనీ కౌంటింగ్ మెషిన్ తెప్పించి లెక్కించారు. ఆ డబ్బాల్లో ఉన్నది అక్షరాలా రూ.42 కోట్లు.. ఆ ఇల్లు కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అఖండ్ శ్రీనివాసమూర్తికి స్వయానా అక్క అయిన అశ్వతమ్మది. ఆమె భర్త బృహన్ బెంగళూరు మహానగర పాలికె కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆర్ అంబికాపతి. లోతుగా కూపీ లాగితే ఈ డబ్బంతా చెన్నై మీదుగా హైదరాబాద్ తరళించేందుకు సిద్ధం చేశారని తేలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీయే ఈ డబ్బు తరలిస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరీ అంబికాపతి?
కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు అంబికాపతి అత్యంత సన్నిహితుడు. బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్పతో కూడా అంబికాపతికి మంచి సంబంధాలున్నాయి. అంబికాపతి సతీమణి అశ్వతమ్మ కాంగ్రెస్ నేత ఆఖండ శ్రీనివాసమూర్తికి అక్క. కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంబికాపతి ప్రస్తుతం కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. గత పదేండ్లలో కాంట్రాక్టు టెండర్లలో ఎక్కువగా పాల్గొనని అంబికాపతి.. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. కాంగ్రెస్ కీలక నేతల ఆర్థిక లావాదేవీలన్నీ అంబికాపతి, ఆయన బంధువులు చూసుకొంటారని సమాచారం. ‘40 శాతం కమీషన్ రాజ్’తో కర్ణాటకలోని గత బీజేపీ సర్కారు అక్రమాలకు పాల్పడుతున్నదంటూ ఆరోపించిన కాంట్రాక్టర్ల సమూహంలో అంబికాపతి కీలక పాత్ర పోషించారు. మాజీ మంత్రి మునిరత్నపై అవినీతి ఆరోపణలు చేసిన కేసులో అంబికాపతి అరెస్టయ్యారు.
రూ. 8 కోట్లు ఇప్పటికే తరలింపు?
ఐటీ అధికారులు మొత్తంగా రూ.50 కోట్ల అక్రమ సొమ్మును పట్టుకోవాల్సి ఉన్నదని.. అయితే, ఇప్పటికే రూ.8 కోట్లు రాష్ట్రం నుంచి అప్పటికే తరలించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సొమ్ము తెలంగాణ ఎన్నికల్లో వినియోగించనున్నట్టు అనుమానిస్తున్నారు.