హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు బ్రేక్ వేయడంతో కాంగ్రెస్ సర్కారు (Congress Govt) అయోమయంలో పడింది. ఎన్నికలపై ఏం చేద్దాం? ఎలా ముందుకెళ్దాం? అని మల్లగుల్లాలు పడుతున్నది. ఇప్పటికిప్పుడు తెలంగాణ సర్కారు ముందు నాలుగు మార్గాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోపై హైకోర్టు జారీచేసిన స్టేను ఎత్తివేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లి అభ్యర్థించే అవకాశం ఉన్నది. హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన ఎన్నికల నోటిఫికేషన్ రద్దయినందున, పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పే చాన్స్ కూడా ఉన్నది. పార్టీపరంగా బీసీలకు 42% టికెట్ల కేటాయింపు అనేది అన్ని పార్టీలు పాటించకపోవచ్చు. దీనిని బీసీ శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే అవకాశం లేదు. ఈ దశలో రేవంత్‌రెడ్డి సర్కారు పార్టీపరంగా 42% టికెట్లు ఇస్తామనే సాహసం చేయకపోవచ్చని తెలుస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ముందున్న మూడో అవకాశం పాత రిజర్వేషన్లతోనే కొత్తగా మరో జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించే మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొత్త నోటిఫికేషన్‌తో ఎన్నికలకు వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే చావుదెబ్బ తప్పదనే భయం కాంగ్రెస్ సర్కారును వేధిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎదుట ఉన్న చివరి అవకాశం హైకోర్టులో కేసు తేలే వరకు ఎన్నికలు వాయిదా వేయడం, ఆ తర్వాతే ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడం. పైన చెప్పిన మూడు ఆప్షన్లు అంతగా సముచితం కావని పార్టీవర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం గత నెల 29న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీచేసింది. గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదేరోజు బీసీలకు 42% రిజర్వేషన్ జీవోపై హైకోర్టు స్టే విధించింది. విచారణను ఆరు వారాలపాటు వాయిదా వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం తామిచ్చిన షెడ్యూల్‌ను ఇదేరోజు రద్దుచేసింది. డిసెంబర్లో మళ్లీ ఈ అంశంపై విచారణ జరుగనున్నది. వాదనలు, ప్రతివాదనలు, వాయిదాలు.. ఇలా డిసెంబర్ కూడా ముగిసే అవకాశం లేకపోలేదు. ఏ విధంగా చూసినా ఈ ఏడాదిలో ఎన్నికలు జరగబోవని తెలుస్తున్నది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2026లో స్థానిక పోరు జరిగే అవకాశం ఉన్నది.