నియోపొలిస్‌లో చేసిన లేఅవుట్ ప్లానింగ్‌లో 41 ఎకరాలను భవిష్యత్తు అవసరాల కోసం అలాగే ఉంచుతున్నం. దానిని లంగ్‌స్పేస్‌గా వాడుకోవాలి. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో అద్భుతమైన పార్క్ ను అక్కడ అభివృద్ధి చేసుకుందాం. పిల్లల ఆటస్థలం, సైకిల్ ట్రాక్ లాంటివి కట్టుకుందాం.
-2022 సెప్టెంబర్ 25న నియోపొలిస్ లేఅవుట్ పరిశీలనలో అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఖజానా ఖాళీ కావడంతో రాష్ట్ర సర్కారు కాసుల వేటలో పడి ప్రజా ప్రయోజనాలను బలిపీఠమెక్కిస్తున్నది. భవిష్యత్తు అవసరాలపై అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతర్జాతీయస్థాయి మౌలిక వసతులతో, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోకాపేట నియోపొలిస్ ప్రాజెక్టును డెవలప్ చేసింది. ప్లాట్ల విషయంలో అధికారులు రూపొందించిన ప్లాన్లను ఎంతో జాగ్రత్తగా పట్టాలెక్కించింది. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ ప్రాంతాన్ని మల్టీపుల్ జోన్‌గా గుర్తించి ప్రజా అవసరాలకు వినియోగించే భవనాలకు అనువుగా భూమిని కేటాయించింది. రూ.5 వేల కోట్ల ఆదాయ అంచనాలతో వేలానికి సిద్ధం చేసిన 41 ఎకరాల భూములను కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఈ మేరకు అధికారులు లేఅవుట్లలో మార్పులు చేస్తున్నారు.
ఐటీ కారిడార్‌కు సమీపంలోని కోకాపేట భూములకు హైదరాబాద్ రియాల్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతర్జాతీయస్థాయి మౌలిక వసతులు, మెరుగైన రవాణా సదుపాయాల అనుసంధానం, హైరైజ్ భవనాల నిర్మాణానికి అనువుగా ఈ లేఅవుట్‌ను బీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని డెవలప్ చేసింది. వందల ఎకరాల్లో ఒక్కో ప్లాటును తీర్చిదిద్దింది. అందుకు తగినట్టు ఊహించిన ధరలో ఆ భూములకు డిమాండ్‌ను తీసుకువచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ముంబై తర్వాత ఎకరం వంద కోట్లకు అమ్ముడుపోయిన భూముల జాబితాలో కోకాపేట్ లే అవుట్ కూడా చేరింది. రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ నగరం దిక్సూచీగా మారేలా చేసింది. ఈ క్రమంలోనే వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. ఏనాడూ వీటినొక ఆదాయ వనరుగా భావించకుండా.. క్యాపిటల్ క్యాటలిస్ట్‌గా పరిగణించి భూముల వేలాన్ని నిర్వహించింది. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూములను కేవలం ఆదాయ వనరుగా భావిస్తున్నది. అభివృద్ధి పథకాలను పట్టాలెక్కించేందుకు వెక్కిరిస్తున్న ఖాళీ గల్లాపెట్టెను భర్తీ చేసేందుకు అంగట్లో మరో రకంగా అమ్మకానికి పెడుతున్నది. ఇప్పటికే టీజీఐఐసీ, మరోవైపు హౌసింగ్ కార్పొరేషన్‌తోపాటు, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వేలం భూములను విక్రయిస్తున్నది.

కోకాపేట్ లే అవుట్‌లోని భూముల వేలానికి కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాదిలో రెండోసారి హెచ్ఎండీఏను ఆదేశించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు రావడమే ఆలస్యం హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. గత ప్రభుత్వం బహుళ ప్రయోజనాలకు వీలుగా రూపొందించిన లే అవుట్‌ను మార్చివేస్తున్నారు. నిబంధనల ప్రకారం మల్టీపుల్ జోన్ పరిధిలోని భూములను గృహ అవసరాలతోపాటు ఇతర అవసరాలకూ వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ భవిష్యత్తు అవసరాలపై అవగాహన లేకుండా.. వివిధ రంగాల భూములను విక్రయించడంపై అభ్యంతరం వ్యక్తమవుతున్నది. అధికారిక లేఅవుట్‌ను మార్చివేసిన హెచ్ఎండీఏ.. ఇదొక ఘనకార్యంగా చెప్పుకుంటున్నది. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా లే అవుట్లో మార్పు చేసుకోవచ్చనీ, ఇందులో ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని వాదిస్తున్నది.
తొలిసారి భూముల వేలానికి ఏర్పాట్లు చేసినప్పుడు సెక్టార్-3లోని 41.21 ఎకరాల భూమిని మల్టీపుల్ జోన్‌గా నిర్ధారించారు. ఈ భూమిలో కన్వెన్షన్ సెంటర్, హోటల్, రెస్టారెంట్, షాపింగ్ మాల్స్, ఇండోర్ గేమ్, మల్టీమోడల్ ట్రస్ట్ హబ్, మెట్రో మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. కానీ ఈ భూములను ఇప్పుడు సర్కారు ప్లాట్లుగా విభజించింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుండగా.. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఖాళీ జాగాలే లేకుండాపోతాయని పరిశీలకులు ఆందోళన చెందుతున్నారు. బహుళ ప్రయోజనాలు, అంతర్జాతీయస్థాయి ప్రమాణాలకు లోబడి అభివృద్ధి చేసిన లేఅవుట్లో పబ్లిక్ యూటిలిటీకి అవకాశమే లేకుండా పోతుందని, ఖజానా నింపుకొనేందుకు ఈ తరహా విధానం సరికాదనీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.