హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఏడాది పాలనలో 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలేనని విమర్శించారు. పండుగలాంటి వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ సర్కార్ తిరోగమనంపాలు చేసిందని మండిపడ్డారు.
రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా ఇద్దరు రైతులు, సోమవారం జోగులాంబ గద్వాల జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఏడాదికాలంగా రోజుకోక రైతు బలవన్మరణానికి పాల్పడటం విషాదకరమని పేర్కొన్నారు. పంట పెట్టుబడికి డబ్బుల్లేక, పంటలకు గిట్టుబాటు ధరరాక రైతులు అప్పుల పాలవుతున్నారని తెలిపారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో రూ.4.5 లక్షల కోట్లతో వ్యవసాయ రంగానికి చేయూతను అందించారని, 11 విడతల్లో రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.73 వేల కోట్లును రైతుబంధు రూపంలో జమచేసిన విషయాన్ని ఆయన ఉదహరించారు. అబద్ధపు హామీలతో గద్దెనెకిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.