హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రయోజనం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ప్రమాద బీమాను రూ. 40లక్షలకు పెంచనుంది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా తో సంస్థ ఒప్పందం కుదుర్చుకోనుంది. సింగరేణికి రాష్ట్రంలో 40కి పైగా గనులున్నాయి. 25వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు.
సీఎండీ ఎన్ బలరాం పలు బ్యాంకులతో సంప్రదింపులు జరిపిన ఫలితంగా ఉచిత ప్రమాద బీమా కల్పించేందుకు ముందుకొచ్చాయి. కార్మికులు, సంస్థ రూపాయి ప్రీమియం చెల్లించకుండా, ఉద్యోగుల ఖాతాలను ఆయా బ్యాంకులకు బదలాయిస్తే ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించేలా బలరాం ఒప్పించారు. ఇది వరకు కాంట్రాక్ట్ కార్మికుల బ్యాంకు ఖాతాలు హెచ్డీఎఫ్సీలో ఉండగా ఈ బ్యాంకు రూ. 30లక్షల ఉచిత ప్రమాద బీమా కల్పిస్తున్నది. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 40లక్షల పరిహారాన్నిచ్చేందుకు ముందుకొచ్చింది. బ్యాంకులతో సింగరేణి ఎంవోయూను కుదుర్చుకోనున్నది.