హనుమకొండ, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): డ్రంక్అండ్డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిపై కేసు కాకుండా తప్పించడానికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు రూ.4 లక్షలు తీసుకున్నట్టు ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణలోనే తేలింది. మద్యం మత్తులో కారు నడుపుతున్న వ్యక్తిని కాకుండా పక్క సీట్లో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని బెదిరించి రూ.లక్ష వసూలు చేశారు. గంజాయి కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్, ఎస్సై వ్యవహారంపై ఈ నెల 15న ‘నమస్తే తెలంగాణ’లో ‘నరకం చూపుతున్న ఖాకీ!’ శీర్షికతో వచ్చిన కథనంపై వరంగల్ పోలీసు కమిషనర్ విచారణకు ఆదేశించారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై వారం రోజుల క్రితం వాహనాలు తనిఖీ చేసే సమయంలో ఐనవోలు మండలానికి చెందిన ఇద్దరు యువకులు మద్యం సేవించి కారులో వెళ్తూ పట్టుబడ్డారు.
ఎస్సై ఇద్దరినీ పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లిన కొద్ది సేపటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు పోలీసులకు ఫోన్ చేసి డ్రైవింగ్ చేసిన యువకుడిని వదిలిపెట్టాలని సూచించడంతో కొద్ది సేపటికే పంపించారు. పక్క సీట్లో కూర్చున్న యువకుడిని రోజంతా పోలీసుస్టేషన్లో చిత్రహింసలకు గురిచేశారు. బాధిత యువకుడు బంగారు గొలుసు కుదవబెట్టి పోలీసు స్టేషన్లో రూ.లక్ష ఇచ్చాడు. ఆ తర్వాత అదే ఎస్సై మరోసారి బాధిత యువకుడి వద్ద 8 గ్రాములు గంజాయి దొరికినట్టు కేసు నమోదుచేశాడు. కారు నడుపుతున్న యువకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఇంటెలిజెన్స్ పోలీసులు మరింత లోతుగా విచారించారు. డ్రైవింగ్ సీటు పక్కన కూర్చున్న యువకుడిని పోలీసులు కొట్టడం, రూ.లక్ష వసూలు చేసి గంజాయి కేసు పెట్టడం నిజమేనని తేలింది. లంచం తీసుకుని అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు బలంతో డ్రైవింగ్ చేసిన వ్యక్తిని తప్పించినట్టు తెలిసింది. మద్యం తాగి కారు నడిపిన వ్యక్తిపై కేసు కాకుండా చూసేందుకు ఎమ్మెల్యే కొడుకు రూ.4 లక్షలు తీసుకున్నట్లు పోలీసు విచారణలో తేలింది.
పోలీసు దెబ్బలతో బాధిత యువకుడి ఆరోగ్యం తెబ్బతినగా వరంగల్ దవాఖానలో చేరాడు. ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో బాధిత కుటుంబం మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మద్యం తాగి వాహనం నడిపిన వారిని తప్పించి, పక్క సీట్లో ఉన్న వారి నుంచి నగదు వసూలు చేసి, పాత కేసులు పెట్టిన పోలీసులపై చర్యల విషయంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సై, సీఐ, ఏసీపీలు ఎమ్మెల్యే లేఖతో పోస్టింగ్లు పొందినవారే కావడంతో తదుపరి చర్యలపై ఉన్నతాధికారులు జాప్యం చేస్తున్నట్టు తెలిసింది. వరంగల్-ఖమ్మం జాతీయరహదారి వెంట ఉన్న పోలీసు స్టేషన్లలోని ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు నెలవారీ మామూళ్లు తీసుకుంటూ ఇసుక, మొరం, మట్టి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే చర్చ జరుగుతున్నది. ఎమ్మెల్యే సిఫారసు లేఖతోనే పోస్టింగులు పొందిన వారు కావడంతో ఏం చేసినా చర్యలు తీసుకోరనే ఉద్దేశంతో ఈ స్టేషన్లలోని అధికారులు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.