హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ‘రైతాంగానికి 24 గంటల కరెంటు, పుష్కలంగా నీళ్లు అందిస్తే.. రైతులు పంటల రూపంలో సంపద సృష్టిస్తారు. ఆ సంపద సమాజంలోకి వచ్చి తిరుగుతుంది.. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది’.. పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పిన మాట ఇది. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతున్నది. పుట్లకొద్దీ ధాన్యం ఉత్పత్తి చేస్తూ రైతులు తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకొంటున్నారు. రైతుల కండ్లల్లో 24 గంటల ఉచిత కరెంటుపై భరోసా, పుష్కలమైన కాళేశ్వరం నీళ్లపై నమ్మకం స్పష్టంగా కనిపిస్తున్నది.
రాష్ట్రం ఏర్పడేనాటికి ఏ రంగానికీ 24 గంటల విద్యుత్తు లేదు. ఇక వ్యవసాయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఉమ్మడి రాష్ట్రంలో 6 గంటల విద్యుత్తు అని చెప్పినా పగటిపూట 3 గంటలే.. అది కూడా మూడునాలుగు విడతలుగా ఇచ్చేవారు. రాత్రిపూట అంతకంటే అధ్వాన్నం. కానీ, తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల విద్యుత్తును అందించడంతోపాటు.. వ్యవసాయానికి 9 గంటలపాటు అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేశారు. ఆపై 24 గంటల నిరంతరాయ విద్యుత్తును అందించేందుకు కావాల్సిన చర్యలు తీసుకున్నారు. దీంతో తెలంగాణ రైతుల్లో భరోసా పెరిగింది. ఆ ఫలితంగానే 2014-15లో రూ. 12,871 కోట్ల విలువైన ధాన్యం పండించారు. 2016-17 నాటికి రూ.18,687 కోట్ల విలువైన ఉత్పత్తి చేశారు. 2018 జనవరి నుంచి 24 గంటల నిరంతరాయ విద్యుత్తును అందించడంతో 2022-23 నాటికి ఏకంగా రూ.54,546.80 కోట్ల విలువైన ధాన్యాన్ని పండించారు. తొమ్మిది సంవత్సరాల్లోనే నాలుగు రెట్లకుపైగా విలువైన ధాన్యాన్ని ఉత్పత్తి చేశారంటే.. వ్యవసాయం ఏ రీతిలో అభివృద్ధి సాధించిందో అర్థమవుతుంది. ధాన్యం విషయంలో తెలంగాణ రైతులు ఇంతటి సంపద సృష్టించడానికి కారణం రెండే అంశాలు. ఒకటి 24 గంటల ఉచిత విద్యుత్తు, రెండోది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ రెండే తెలంగాణ వ్యవసాయ రంగం రూపురేఖలను సమూలంగా మార్చేలా చేసిన జోడెడ్లు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తును అందించేందుకు దాదాపు రూ.18,331.82 కోట్లు ఖర్చుపెట్టి ట్రాన్స్మిషన్, డిస్కం వ్యవస్థలను ప్రభుత్వం బలోపేతం చేసింది. క్షేత్రస్థాయిలో 400 కేవీ నుంచి మొదలుకొని.. 11 కేవీ లైన్లను గణనీయంగా పెంచారు. అదేస్థాయిలో సబ్స్టేషన్లను కూడా భారీగా నిర్మించారు. డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లను వేలసంఖ్యలో అదనంగా బిగించారు. దీంతో 2018 జనవరి ఒకటి నుంచి తెలంగాణ రైతాంగానికి 24 గంటల నిరంతరాయ విద్యుత్తు పూర్తి ఉచితంగా అందుతున్నది. రైతులు తమ వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లను అదే స్థాయిలో పెంచారు. 2014లో 19.02 లక్షల కనెక్షన్లు ఉండగా.. 2018 జనవరి 2 నాటికి 22.64 లక్షలకు పెరిగాయి. 2023 జూలై 1 నాటికి కనెక్షన్ల సంఖ్య 27.63 లక్షలకు చేరింది. ఇందుకు అవసరమైన విద్యుత్తు కోసం ప్రభుత్వం సొంతంగా విద్యుత్తు కేంద్రాలను నిర్మిస్తున్నది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 7,778 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, 2023 జూలై ఒకటి నాటికి 18,756 మెగావాట్లకు చేరింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వ్యవసాయ రంగం ముఖచిత్రాన్నే మార్చేసింది. ఇంజినీర్లే ఔరా అనేలా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 2016లో శంకుస్థాపనం చేసిన సీఎం కేసీఆర్, 2019 జూన్లో పూర్తి చేశారు. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన ఖర్చు రూ.84 వేల కోట్లు. సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీటిని చేర్చి.. ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి ఈ ప్రాజెక్టు జవసత్వాలు అందించింది. మంజీర, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ లాంటి ముఖ్యమైన ప్రాజెక్టులను పునరుజ్జీవం చేయడంలో కాళేశ్వరం పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. దీంతోపాటు కాళేశ్వరం పరిధిలో 147 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండేలా రిజర్వాయర్లు, ప్రాజెక్టులను నిర్మించారు. రోజుకు 3 టీఎంసీల చొప్పున 60 రోజులపాటు 180 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా డిజైన్ చేశారు. 15,000 పైగా చెరువులను నింపుతూ.. వానకాలం, యాసంగి పంటలు పండేందుకు కావాల్సిన సాగునీటిని ఈ ప్రాజెక్టు అందిస్తున్నది. పుష్కలంగా సాగునీరు, భూగర్భ జలాలు అందుబాటులో ఉండటం.. 24 గంటలు విద్యుత్తు ఇవ్వడంతో రైతులు బీడు భూములను కూడా సాగులోకి తెచ్చారు. జోడెడ్ల లాంటి కరెంటు, కాళేశ్వరంతో పుట్లకొద్దీ ధాన్యం పండిస్తున్నారు. దీనికి ఉద్యాన పంటలు, మెట్ట పంటలు, తోటల నుంచి వచ్చిన ఉత్పత్తుల విలువ జోడిస్తే సంపద విలువ ఔరా అనే స్థాయిలో ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.