Krishna River | హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పొంగి పొర్లుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి దిగువకు భారీగా ప్రవాహం కొనసాగుతున్నది. జూరాలకు, అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరిగిపోయింది. శనివారం జూరాలకు 3 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలం ప్రాజెక్టుకు 4.14 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టులో 24 గంటల్లోనే 20 టీఎంసీలకుపైగా జలాలు వచ్చి చేరగా, ప్రస్తుతం 127 టీఎంసీలకు చేరుకున్నది. ఎస్సారెస్పీకి వరద క్రమంగా పెరుగుతున్నా, దిగువన ప్రాణహిత నుంచి ప్రవాహాలు తగ్గుముఖం పట్టాయి. లక్ష్మీబరాజ్ వద్ద వరద ప్రస్తుతం 8,35,795 క్యూసెక్కులు ఉండగా, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కూడా స్వల్పంగానే కొనసాగుతున్నది.
పోతిరెడ్డిపాడు నుంచి నీటిమళ్లింపు షురూ..
శ్రీశైలం ప్రాజెక్టుకు 100 టీఎంసీల జలాలు చేరాయి. ప్రాజెక్టు సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 127 టీఎంసీలకు చేరుకున్నది. శుక్రవారం ప్రాజెక్టు 866 అడుగులకు చేరుకున్నది. ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు ద్వారా 5వేల క్యూసెక్కులను మళ్లిస్తున్నారు. ఏపీ అధికారులు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి 12 టీఎంసీలు కావాలంటూ కేఆర్ఎంబీకి ఏపీ సర్కారు ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది.