Anganwadi Teachers | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మంత్రి సీతక్క బాధ్యతలు స్వీకరించిన వెంటనే మినీ అంగన్వాడీల అప్‌గ్రెడేషన్ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. తద్వారా తొలి 3 నెలలపాటు పెంచిన వేతనాలను వర్తింపజేశారు. నిరుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రధాన సెంటర్ల టీచర్లతో సమానంగా వారి ఖాతాల్లో రూ.13,650 చొప్పున వేతనాన్ని జమచేశారు. దీంతో రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్వాడీల టీచర్లు మురిసిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తమ బతుకులు బాగుపడ్డాయని సంబురంలో మునిగితేలారు.
కానీ, ఇంతలోనే మళ్లీ కథ మొదటికొచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో తిరిగి పాత పద్ధతిలో రూ.7,800 వేతనం మాత్రమే వేశారు. దీనిపై ఆందోళనకు గురైన మినీ అంగన్వాడీ టీచర్లు.. వెంటనే ఆ విషయాన్ని మంత్రి సీతక్కతోపాటు మహిళాశిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మళ్లీ జూన్, జూలై మాసాల్లో పెంచిన వేతనాన్ని జమచేశారు. ఆ తర్వాత నుంచి వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. 2024 ఆగస్టు నుంచి 2025 మే వరకు (గత 10 నెలలుగా) పాత జీతాలే ఇస్తున్నారు. అలా 12 నెలల్లో ఒక్కో టీచర్‌కు రూ.5,850 చొప్పున మొత్తం రూ.28 కోట్లు ఎగ్గొట్టారు. దీనిపై మంత్రి, ఉన్నతాధికారులకు విన్నవిస్తే సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో అంగన్వాడీ టీచర్లు
తమకు తక్కువ వేతనాలు ఇస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని మినీ అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి సీతక్కతోపాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆన్లైన్లో టెక్నికల్ సమస్యల కారణంగా మినీ అంగన్వాడీల అప్‌గ్రెడేషన్ పూర్తి కాలేదంటూ తప్పించుకు తిరుగుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల అప్‌గ్రేడ్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.