హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పండిన ధాన్యంలో ఇప్పటివరకు 33.47 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ. 6,892 కోట్లు ఉంటుందని వివరించారు. వానాకాలం పంటకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల ఎకరాలలో వరి పంట వేయగా కోటి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిని అంచనా వేశామని తెలిపారు.
వీటిలో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం దండుగ కాదు పండుగ అనే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం రైతాంగం సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకుందని అన్నారు. వీటితో పాటు అనేక పథకాలను ప్రకటించి అమలు చేస్తుందని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఐ.కె.పీ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, డీసీఎంఎస్, జీసీసీ, హాకాల ద్వారా గ్రామాలలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారి నుంచి ప్రతేక్ష్యంగా కొనుగోలు చేస్తున్నదని అన్నారు.
భారత దేశం లో తెలంగాణ రాష్ట్రం మినహా ఏ రాష్ట్రం కూడా రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదని, ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతుల ఖాతాలకు నేరుగా నిధులను జమ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రూపాయికి కిలో, వ్యక్తికి ఆరు కేజీల చొప్పున రేషన్ బియ్యం పంపిణి చేస్తున్నామని తెలిపారు.