మహబూబ్‌నగర్/జగిత్యాల కలెక్టరేట్, ఆగస్టు 6: మహబూబ్‌నగర్, జగిత్యాల జిల్లాలో ఇద్దరు అధికారులను ఏసీబీ అ ధికారులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కో రుట్లకు చెందిన శశిధర్ జేసీబీని మూడు రోజుల క్రితం జగిత్యాల డీటీవో భద్రునాయక్ పట్టుకున్నారు. వాహనానికి ఇన్సూరెన్స్, పొల్యూషన్ లేకపోవడాన్ని ఆసరాగా తీసుకున్న అధికారి, శశిధర్‌ను రూ.40 వేల లంచం డిమాండ్‌చేసి, రూ.35 వేలకు ఒప్పందం చేసుకున్నారు. శశిధర్ బుధవారం కార్యాలయంలో డీటీవో డ్రైవర్ అరవింద్‌కు మిగతా రూ.22 వేలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
డీటీవో ఆదేశాల మేరకే డబ్బులు తీసుకున్నట్టు డ్రైవర్ ఒప్పుకోవడంతో భద్రునాయక్‌ను అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ రైతు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీంలో భూమికి సంబంధించిన జాయింట్ యాక్షన్ రిపోర్టు, ఎన్వోసీ ఇవ్వాలని ఇరిగేషన్ సబ్ డివిజన్-1 ఏఈఈ మహ్మద్ ఫయాజ్ను సంప్రదించగా లంచం డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో రైతు నుంచి రూ.3 వేలు తీసుకుంటుండగా.. ఏఈఈని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మహమ్మదాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు.