రాజన్న సిరిసిల్ల, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : పానీపూరి తిని తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వైద్యులకు సూచించారు. గురువారం ఆయన మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి సిరిసిల్ల పట్టణంలో పర్యటించారు. ఈ నెల 16న తంగళ్లపల్లి మండలం కేసీఆర్‌నగర్ కాలనీలో పానీపూరి తిని అస్వస్థతకు గురై సిరిసిల్ల దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను వారు పరామర్శించారు. చికిత్స పొందుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చిన్నారులను పలుకరిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జాగ్రత్తగా ఉండాలని, వైద్య సహాయం కోసం తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. సిరిసిల్ల దవాఖానకు కేటీఆర్, హరీశ్‌రావు రావడంతో పలువురు కలిసేందుకు ఆసక్తి కనబరిచారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, సెస్ డైరెక్టర్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు, తదితరులు ఉన్నారు.
సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తనయుడు అశ్విన్‌రావు ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా, గురువారం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ద్వాదశ దినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్‌రావు హాజరై అశ్విన్‌రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత సిరిసిల్లలోని సీనియర్ జర్నలిస్ట్ టీవీ నారాయణను పరామర్శించారు. ఇటీవలే మరణించిన ఆయన తల్లి వెంకటలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.