చెన్నై: అక్రమంగా మద్యం అమ్ముతున్న ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఆరోగ్యం విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు. అయితే పోలీసులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. (man dies after arrest) తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మద్యపాన నిషేధ అమలు చర్యల్లో భాగంగా 120 మద్యం సీసాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణతో 24 ఏళ్ల అరుణాచలంను తుత్తుకుడి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కస్టడీలో అతడు కుప్పకూలడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
కాగా, అరుణాచలం కస్టడీలో ఉన్నప్పుడు నలుగురు పోలీసులు తీవ్రంగా కొట్టారని, గాయాలతో కుప్పకూలిన అతడ్ని ఆసుపత్రిలో చేర్చినట్లు ఆ యువకుడి తల్లి ఆరోపించింది. తలకు తీవ్ర గాయమైందని, శస్త్రచికిత్స అవసరమని పోలీసులు తమకు సమాచారం ఇచ్చినట్లు చెప్పింది. తన కుమారుడి కస్టడీ మరణంపై పారదర్శకమైన విచారణ జరగాలని డిమాండ్ చేసింది. అరుణాచం మృతదేహాన్ని తీసుకునేందుకు అతడి కుటుంబ సభ్యులు నిరాకరించారు.
మరోవైపు అరుణాచలం కుటుంబ సభ్యుల ఆరోపణలను పోలీసులు ఖండించారు. లాకప్‌లో తోటి ఖైదీలతో మాట్లాడుతూ అతడు కుప్పకూలి ఆ తర్వాత కోలుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. స్టేషన్ బెయిల్ మంజూరు చేసి వైద్య పరీక్షల కోసం కుటుంబ సభ్యులతో పాటు ఆసుపత్రికి పంపిపట్లు చెప్పాడు. ఆసుపత్రి సమీపంలో అతడు మళ్లీ కుప్పకూలిపోయాడని, తలకు సర్జరీ తర్వాత చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీస్ అధికారి వివరించారు. ఈ పరిణామాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయని తెలిపారు. అతడి తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
అయితే, కొన్ని రోజుల కిందట నాగర్‌కోయిల్‌లో అక్రమ గుట్కా విక్రయాల కేసులో అరెస్టైన దివ్యాంగుడైన శబరివర్మన్ కూడా జ్యుడీషియల్ కస్టడీలో మరణించాడు. తాజాగా మరో యువకుడు పోలీస్ కస్టడీలో చనిపోవడం రాజకీయాంశంగా మారింది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై డీఎంకే ఎంపీ కనిమొళి మండిపడ్డారు. తాజా సినిమా విడుదలలో సీఎం బిజీగా ఉండటంతో రాష్ట్రంలో లాకప్ మరణాలు జరుగుతున్నాయని విమర్శించారు.