హైదరాబాద్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతుండడం, వీటికి మత్తుకు యువత బానిసలవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే డ్రగ్స్, గంజాయి పట్టుబడుతున్నాయి. ఈ ఏడాది 30శాతానికి పెరిగిన ఎన్డీపీఎస్(నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్స్) కేసుల సంఖ్య తెలంగాణలో ‘మత్తు’ మూలాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తున్నది. ఈ ఏడాది జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గత కేసీఆర్ సర్కారు ఏర్పాటుచేసిన యాంటీ నార్కోటిక్ టీమ్‌ను.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈగల్ ఫోర్స్‌గా మార్చింది. డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. గతంతో పోల్చితే 39శాతం యువత డ్రగ్స్‌కు బానిసలు కావడం దురదృష్టకరం.
2023లో రూ.94.39 కోట్లు, 2024లో రూ.139.69 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటే ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో రూ.172.93 కోట్ల విలువైన సింథటిక్ డ్రగ్స్, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. ఈ ఏడాది ఎన్డీపీఎస్ కేసుల్లో 81మందికి శిక్ష పడినట్టు తెలిపారు. సుమారు రూ.41.47 కోట్ల విలువైన ఆస్తులను డ్రగ్స్ పెడ్లర్ల నుంచి జప్తు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ ఏడాది 571కార్యక్రమాలు చేపట్టామని, 47,881మంది యాంటీ డ్రగ్ సోల్జర్స్‌ను ఎన్రోల్ చేశామని పేర్కొన్నారు. కల్తీ కల్లు కేసుల్లో రూ.42 కోట్ల విలువైన ఆల్ప్రజోలం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 2,337 కేసుల్లో 26,988 కిలోల డ్రగ్స్‌ను నిర్వీర్యం చేసినట్లు డీజీపీ వెల్లడించారు.