Miryalaguda | నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మరణించిన వారిని అమ్మమ్మ వనం చంద్రకళ, మనుమడు లక్ష్మణ్ (16), మనమరాలు ప్రణతి (14) మృతిచెందినట్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని కలాల్‌వాడకు చెందిన చంద్రకళ, సైదులు భార్యభర్తలు. చంద్రకళ భర్త అనారోగ్యంతో కొన్ని రోజుల కిందటే మరణించాడు. ఇక చంద్రకళ పెద్ద కూతురు ధనమ్మ భర్త పదేళ్ల కిందట చనిపోయాడు. అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలు లక్ష్మణ్ (16), ప్రణతి (14)తో పుట్టింట్లోనే ఉంటోంది. ఉపాధి నిమిత్తం ఇళ్లలో పనిచేసేందుకు ధనమ్మ మూడు రోజుల కిందట పుణేకు వెళ్లింది.
ఇదిలా ఉంటే.. గురువారం రాత్రి మనుమడు, మనుమరాలితో చంద్రకళ తమ రేకుల ఇంట్లో నిద్రిస్తుండగా షార్ట్‌సర్క్యూట్ అయ్యింది. విద్యుదాఘాతం కారణంగా ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా.. భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాలను వెలికితీశారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు ఘటనాస్థలిని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. పూర్తిగా కాలిన మృతదేహాలను స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.