రంగారెడ్డి, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి తదితర మండలాలకు శాశ్వత సాగునీటి కలను కేసీఆర్ (KCR) నెరవేర్చారు. వర్షాలు కురిస్తే తప్ప వ్యవసాయం చేసుకోలేని రైతులకు శాశ్వత సాగునీరు అందించాలన్న లక్ష్యంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన జంగారెడ్డిపల్లి నుంచి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల గుండా రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పరిధిలోని అనేక గ్రామాలను కలుపుతూ 60కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.182 కోట్లను కేటాయించింది. అప్పటి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్..
అప్పటి సీఎం కేసీఆర్ను కలిసి ఈ ప్రాంత ప్రజలకు సాగునీటి సమస్య తీర్చాలంటే కాలువల ద్వారా అందించాల్సిన అవసరం ఉన్నదని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ వెంటనే స్పందించి నిధులు విడుదల చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాలువల నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. మూడు రోజుల క్రితం అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ నీరు కాలువ చివరి భాగమైన మాడ్గుల మండలంలోని దొడ్లపాడు మీదుగా నాగిళ్ల చెరువుకు నీరు చేరుకున్నది. కాలువ ద్వారా వచ్చే నీటితో మూడు మండలాల పరిధిలో సుమారు 8వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. తమ ప్రాంతానికి శాశ్వత సాగునీటిని అందించటానికి కృషి చేసిన కేసీఆర్కు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.