బెంగళూరు, మార్చి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిత్యం వార్తలో నిలవాలన్నదే లక్ష్యం.. తన గురించే చర్చించుకోవాలన్న ఎత్తుగడ.. అసంబద్ధ విమర్శలు, మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టే ముచ్చట్లు.. కూలుస్తా, బద్దలు కొడతా, అగ్గిపెడతా అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఇదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారం. వివాదాలు రాజేయడం, రాజకీయ లబ్ధి పొందేందుకు అడ్డగోలుగా మాట్లాడటమే ఆయన విధానం. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది మొదలు ఇదే తంతు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ దారుస్సాలమ్ను కూలుస్తాం.. పాత బస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తాం అంటూ కవ్వింపు చర్యలకు తెగబడి తీవ్ర విమర్శల పాలయ్యారు. ‘గుళ్లను తవ్వుదాం శవాలు వస్తే మీవి.. శివలింగాలు వస్తే మావి’ అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు బరితెగించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ గుమ్మటాలను కూలగొడతామని విపరీత వ్యాఖ్యలు చేసి తెలంగాణపై తన అక్కసును వెళ్లగక్కారు. ఇప్పుడు ఆడబిడ్డ, ఎమ్మెల్సీ కవితపై అదే పనిగా నోరుపారేసుకొంటున్నారు. సోయి మరచి అనుచిత వ్యాఖ్యలు చేసి తన నోటిదురుసుతనాన్ని బయటపెట్టుకున్నారు. బండి సంజయ్ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ప్రచార యావతో, నోటిదురుసుతనంతో బండి చేస్తున్న వ్యాఖ్యలతో ఆయనను ప్రజలు పిచ్చోడిగా పరిగణిస్తున్నారు.