ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గురుకుల విద్యాలయాలు, ఉచిత విద్యుత్తు, గొర్ల పంపిణీ, చేపల పంపిణీ, పల్లెప్రగతి, రైతుబీమా, రైతుబంధు, టీ హబ్.. ఇలా ప్రతి వర్గానికి ఏదో లబ్ధి చేకూర్చే పథకాలను కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టింది. ఫలితంగా అట్టడుగు వర్గాల ఆర్థిక అభ్యున్నతికి కొత్త బాటలు పడ్డాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కేసీఆర్ పదేండ్ల పాలన సంక్షేమంలో స్వర్ణయుగం.
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం ఛిన్నాభిన్నమై, దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నది. కానీ, స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ సంక్షేమరంగం కేసీఆర్ పాలనలో దేశానికి దిక్సూచిగా నిలిచింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచీ కేసీఆర్ ఎప్పటికప్పుడు అనేక విప్లవాత్మక పథకాలకు శ్రీకా రం చుడుతూ సబ్బండ వర్గాల సంక్షేమానికి కొత్త బాటలు వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఆశించినస్థాయికి మించి సత్ఫలితాలను సాధించింది. రాష్ట్రంలో సరికొత్త సామాజిక విప్లవానికి బాటలు వేసింది.
పేదరిక నిర్మూలన
దేశవ్యాప్తంగా రోజురోజుకు పేదరికం పెరుగుతుంటే.. సంక్షేమ పథకాల ఫలితంగా తెలంగాణ మాత్రం పేదరిక నిర్మూలన దిశగా సాగింది. వ్యవసాయ రంగం స్థిరీకరణ, వ్యవసాయనుబంధ రంగాలు, కులవృత్తుల ప్రోత్సాహంతో గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలు పెరిగాయి. కూలీరేట్లు పెరిగాయి. చేతినిండా, పనికి తగిన వేతనం పొందగలిగే పరిస్థితులు వచ్చాయి. వెరసి తాత్కాలిక, అంతర్గత వలసలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆసరా పింఛన్లు, ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం పంపిణీ అట్టడుగువర్గాల ప్రజల కడుపు నింపాయి. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో పేదరికం 21.92 శాతం ఉండగా, ప్రస్తుతం 5.8 శాతానికి పడిపోయింది. మొత్తంగా పదేండ్లలో 16.12 శాతం పేదరికం తగ్గటమే కేసీఆర్ సంక్షేమ పాలనకు నిలువెత్తు నిదర్శనం.
చేతల్లో మహిళా సాధికారత
బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేసింది. ఆడబిడ్డలకు ఉన్నతస్థానాన్ని కల్పించింది. రేషన్ కార్డయినా, రెండు పడక గదుల ఇల్లయినా, కల్యాణలక్ష్మి/షాదీముబారక్, దళితబంధు చెక్కులైనా ప్రభుత్వం అమలు చేసే పథకమేదయినా.. ఆడబిడ్డ పేరిటే అందించింది. ఆడబిడ్డ గర్భం దాల్చింది మొదలు సుఖప్రసవమై తిరిగి ఇంటికి చేరేవరకూ కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మఒడి పథకాలు అండగా నిలిచాయి. మాతాశిశుమరణాలకు స్వస్తి పలికాయి. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య కోసం ప్రవేశపెట్టిన గురుకుల విద్యాలయాలు లక్ష్యానికి మించి ఫలితాలు సాధించాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ బాల్యవివాహాల నిర్మూలనకు దోహదపడ్డాయి. నామినేటెడ్ పోస్టులు మొదలు, పంచాయతీలు, మున్సిపాలిటీల్లోనూ మహిళలకు సగం స్థానాలు కట్టబెట్టి రాజకీయ అవకాశాలను కల్పించి రాష్ట్ర అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసింది.
అందుబాటులోకి అందరికీ విద్య
అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ కలిపి 1,022 గురుకులాలను నెలకొల్పింది. అందులోనూ అత్యంత వెనకబడిన, అనాథ బాలలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలుచేసి విద్యాప్రవేశాలను కల్పించింది. డిగ్రీ వరకు ఉచితంగా ఉన్నతవిద్యను అందించింది. అట్టడుగువర్గాల్లో అక్షరకాంతులను నింపుతూ, నవ, విద్యాతెలంగాణ నిర్మాణానికి బాటలు వేసింది.
దళితక్రాంతి
దళితుల సముద్ధరణకు కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేసింది. సొంత వ్యాపారాలు చేసుకోవటానికి, తెలిసిన, నచ్చిన ఉపాధిమార్గాన్ని ఎంచుకుని జీవించడానికి నిరుపేద దళిత కుటుంబాలకు ఎలాంటి షరతులు లేకుండా, బ్యాంకు లింకేజీ లేకుండా రూ.10లక్షల నగదును అందించింది. పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 40 వేల దళిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేసింది. దీంతో కూలీబిడ్డలు ఓనర్లుగా ఎదుగుతుండటం ఒక విశేషమైతే, సామాజిక మార్పునకు ఇది దోహపడుతున్నది. ఈ పథకం యావత్తు దేశాన్నే ఆకట్టుకుంటున్నది.
హస్తం పార్టీ పాలనలో సంక్షేమానికి రిక్తహస్తం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అంతా అస్తవ్యస్తంగా మారింది. పేదల కోసం మానవీయ కోణంలో కేసీఆర్ అమలు చేసిన అనేక పథకాలను రేవంత్‌రెడ్డి సర్కార్ నిలిపేసింది. విదేశీవిద్యానిధి, దళితబంధు, బీసీలకు ఆర్థిక సాయం, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ ఇలా అనేక పథకాలను పెండింగ్‌లో పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల నాటి హామీల సంగతి అటుంచితే మార్గదర్శకాల పేరిట ఉన్న పథకాల అమలుకు తిలోదకాలిచ్చేందుకు సమాయత్తమవుతున్నది. దీంతో ఏ పథకం అమలవుతుందో? ఏది నిలిచిపోతుందో? తెలియని దుస్థితి నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు మినహా మరే పథకాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేసింది లేదు.
కేసీఆర్ ప్రభుత్వం సాధించిన సామాజిక మార్పులు:
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో పేదరికం 21.92 శాతం ఉండగా, 2023 నాటికి 5.8 శాతానికి తగ్గింది. అంటే పదేండ్లలో పేదరికం 16.12 శాతం తగ్గింది.
గురుకుల విద్యను అందుబాటులోకి తీసుకురావటంతో ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ తదితర ఉన్నత విద్యాప్రవేశాల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. పీజీ కోర్సుల్లో 72 శాతం, డిగ్రీలో 52 శాతం, బీఈడీ కోర్సుల్లో 81 శాతం అమ్మాయిలే చేరటం అందుకు నిదర్శనం.ఉచిత కోచింగ్ ఫలితంగా దాదాపు 650 మందికిపైగా బాలికలు మెడిసిన్ సీట్లు సాధించారు.
మహిళా శ్రామిక భాగస్వామ్యంలో 37 శాతంతో దేశంలోనే తెలంగాణ టాప్‌గా నిలిచింది.
16-19 ఏండ్ల మధ్య తల్లులయ్యేవారి సంఖ్య 10.6 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గింది.మహిళల బ్యాంక్ అకౌంట్లు 59.5% నుంచి 84.4 శాతానికి పెరిగాయి.కల్యాణలక్ష్మి/షాదీముబారక్‌తో బాల్యవివాహాలు తగ్గిపోయాయి. తద్వారా మాతాశిశు మరణాల రేటు రికార్డుస్థాయిలో లక్షకు 96 నుంచి 52కు తగ్గిపోయింది. శిశుమరణాల రేటు వెయ్యికి 39 నుంచి 21కు తగ్గిపోయింది. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 91-97కు పెరిగాయి.
