Nagarjuna Sagar | నల్లగొండ : కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి నాగార్జున సాగర్ వైపునకు కృష్ణమ్మ ఉరకలేస్తుంది. దీంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. వరద ప్రవాహం భారీగా ఉండడంతో.. 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 24 గేట్లు 5 అడుగులు, 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2,61,972 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ స్పిల్ వే ద్వారా 2,16,842 క్యూసెక్కులు విడుదల చేశారు. సాగర్ కుడి కాలువకు 8,529 క్యూసెక్కులు విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 587.40 అడుగులుగా ఉంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 305.74 టీఎంసీలుగా ఉంది.