హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటననకు కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు అనుమతి నిరాకరణపై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ ప్రతినిధులు స్పందించిన తీరు ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు ఎవరైనా విదేశాలకు అధికారిక హోదాలో వెళ్తే వారి పర్యటనను విదేశాంగ శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇక్కడి నుంచి పర్యటనకు వెళ్లేవారు విదేశాంగ శాఖకు తొలుత అనుమతుల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వారి అనుమతి ఉంటేనే వెళ్లాలి. విదేశాంగ శాఖ అధికారులు అమెరికా లేదా మరే దేశానికైనా వెళ్లే ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రుల పర్యటనల వివరాలను పరిశీలించడంతోపాటు మన దేశానికి సంబంధించిన విధానపరమైన అంశాలపై చర్చలు, ప్రసంగాల అంశంపై కూడా సూచనలిస్తారు.
ఆ పరిధి దాటవద్దని చెప్తారు. అలాగే, మన దేశ విదేశాంగ విధానానికి విరుద్ధంగా ఉండేవారిని అధికారికంగా కలువవద్దని చెప్తారు. వీటన్నింటికి సంబంధించిన అడ్వైజరీ నోట్‌ను భారత విదేశాంగ శాఖ అందజేస్తుంది. రేవంత్ విషయంలో కూడా ఇదే విధమైన అడ్వైజరీని కేంద్రం ఇచ్చింది. అయితే, ఇక్కడ గమనించాల్సిందేందంటే.. రేవంత్‌రెడ్డి తన పర్యటన వివరాలను పూర్తిస్థాయిలో కేంద్ర విదేశాంగ శాఖకు అందించలేదు. పర్యటన ఉద్దేశాలను స్పష్టంగా చెప్పలేదు. అందుకే హోదాకు తగ్గట్టు పర్యటన లేదని విదేశాంగ శాఖ అధికారులు స్పష్టంచేశారు.
మన దేశ విదేశాంగ శాఖ అధికారులు స్పందిస్తూ సీఎం పర్యటన ఉద్దేశాలపై స్పష్టతలేదని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. సీఎం హోదాలో అమెరికా పర్యటన కు వెళ్లాలనుకున్న రేవంత్ తన పర్యటన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచాలనుకున్నాడన్నదీ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందరికీ బయట సోషల్ మీడియాలో, ప్రకటనల్లో చెప్తున్నట్టు అమెరికాలోని విశ్వవిద్యాలయాల ను చూసేందుకు, అక్కడి చదువులపై స్టడీ చే సేందుకు మాత్రం కాదని కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో తేటతెల్లమైంది. పెట్టుబడుల కోసం కూడా కాదని తేలిపోయింది. ఇక్కడ బయటపెట్టని ఏదో అనుమానాస్పద వ్యవహారం ఉన్నదని కేంద్ర ప్రభుత్వ అధికారులు అనుమానిస్తున్నట్టు తెలుస్తున్నది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యేందుకు ప్రయత్నించినట్టు ఎన్ఆర్ఐ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రేవంత్‌రెడ్డి తమ్ముడు, తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఏదో ఒక మీటింగ్‌లో కలిపించాలని, దాన్ని మీడియాలో ప్రచారం చేసుకోవాలని ప్లాన్ వేసినట్టు చెప్తున్నారు. మొదట వీటి గురించి చెప్పవద్దని, చెప్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని సీఎం సన్నిహిత వర్గాలు భావించినట్టు తెలిసింది.
అమెరికాకు వచ్చాక కలిస్తే అప్పుడేమీ చేయలేరని అనుకున్నట్టు సమాచారం. అయితే, కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలియడంతో చివరి నిమిషంలో అమెరికా పర్యటనకు రేవంత్‌రెడ్డి అధికారిక హోదాలో వెళ్లవద్దని తేల్చి చెప్పినట్టు సమాచారం. దౌత్య విషయాల్లో రాజీపడలేమని, అందుకే పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్టు తేల్చి చెప్పారు. తొలుత నిర్ణయించుకున్న ప్రకారం లండన్‌లో అక్బరుద్దీన్ కుటుంబీకుల పెండ్లికి వెళ్లవచ్చని, అక్కడి నుంచి తిరిగి రావాలని తేల్చిచెప్పినట్టు తెలిసింది.
రేవంత్‌రెడ్డి తన ప్రయాణాన్ని ముగించుకొని ఆదివారం హైదరాబాద్ చేరుకోనున్నట్టు తెలిసింది. అమెరికా ప్రయాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో లండన్ నుంచే ఆయన వెనుదిరుగనున్నారు.
రేవంత్‌రెడ్డి అమెరికా ప్రయాణానికి అనుమతి ఇవ్వకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లేమీ లేవని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. ఇది పూర్తిగా ఆయన పర్యటనను బేరీజు వేసి తీసుకున్న నిర్ణయమని, ఆయన హోదాకు తగ్గట్టుగా పర్యటన లేకపోవడంతోనే అనుమతులు ఇవ్వలేదని ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టిమరీ ఎంఈఏ అధికారులు స్పష్టంచేశారు. దీంతో కేంద్రం ప్రభుత్వం రేవంత్‌రెడ్డిపై కక్ష కట్టిందనడానికి ఆవకాశమే లేదు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక రెండుసార్లు అమెరికా పర్యటనకు వెళ్లిరావడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాన్ని ఎంఈఏ అధికారులు గుర్తుచేస్తున్నారు. గతంలో ఆయన వెళ్తున్న ఉద్దేశం స్పష్టంగా ఉన్నదని, ఈసారి ఆ స్పష్టత లోపించడం వల్లే అనుమతులు నిరాకరిస్తున్నట్టు వెల్లడించారు.