భోపాల్: ఒక ఉపాధ్యాయుడు, గెస్ట్ టీచర్ కలిసి ప్రభుత్వ స్కూల్లో ‘అతి సాన్నిహిత్యం’గా మెలుగుతున్నారు. తరచుగా క్లాస్‌లను ముందుగానే ముగించి వారిద్దరూ కలిసి సమయం గడుపుతున్నారు. ఆ స్కూల్ విద్యార్థులు దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. (Teachers Transferred Over Closeness) ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడు, గెస్ట్ ఉపాధ్యాయురాలిని వేర్వేరు స్కూళ్లకు బదిలీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీచ్ బహ్రీ గ్రామంలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడు, తాత్కాలిక ఉపాధ్యాయురాలిపై పలు ఆరోపణలు వచ్చాయి. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగడంతో తరచుగా తరగతులను ముందుగానే ముగించి ఆ స్కూల్లో కలిసి సమయం గడుపుతున్నారు.
కాగా, ప్రజా విచారణ సందర్భంగా ఛింద్వారా జిల్లా కలెక్టర్‌ను ఆ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు కలిశారు. ఉపాధ్యాయుడు, గెస్ట్ టీచర్ మధ్య ఉన్న ‘అతి సాన్నిహిత్యం’పై ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గిరిజన వ్యవహారాల శాఖ సహాయ కమిషనర్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలను విచారణ కమిటీ పరిశీలించింది. ఫలితంగా ఆ ఉపాధ్యాయుడు, అతిథి ఉపాధ్యాయురాలిపై గురువారం చర్యలు చేపట్టారు. వారిని ఆ పాఠశాల నుంచి తొలగించారు. రెండు వేర్వేరు స్కూళ్లకు వారిని బదిలీ చేశారు. ఆ స్కూల్‌కు కొత్త అతిథి ఉపాధ్యాయులను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ఈ ఆరోపణలను ఆ ఇద్దరు ఉపాధ్యాయులు ఖండించారు. తమను అప్రతిష్టపాలు చేస్తున్నారని విమర్శించారు. గెస్ట్ టీచర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసిన మరో వ్యక్తి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారని ఆ ఉపాధ్యాయురాలు తెలిపారు. తనను తొలగించి ఆ వ్యక్తి నియామకానికి వీలు కల్పించేందుకే ఈ ఫిర్యాదు పన్నాగం పన్నారని ఆమె ఆరోపించారు.