అయితే ఏఐఎస్ఏ కార్యకర్తలు శనివారం కూడా జంతర్ మంతర్ వద్దకు చేరుకుని తమ ఆందోళన కొనసాగించారు. దీంతో పోలీసులు 150 మందికి పైగా కార్యకర్తలు, నేతలను అరెస్ట్ చేశారు. శుక్రవారం అరెస్టయిన ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా మధ్యాహ్నం ఒంటిగంటకు జంతర్ మంతర్ చేరుకుని తమ నిరసనను కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను ద్రోహిగా పేర్కొంటూ ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొందరు ఆందోళనకారులు తమను తాము చైన్లతో బంధించుకుని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేయడం ప్రారంభించారు.
శనివారం కూడా జంతర్ మంతర్‌కు వెళ్లే పలు దార్లను పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. దానిలో భాగంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్)ను రంగంలోకి దించారు. వారిలో కొందరు పెల్లెట్ గన్లు, టియర్ గ్యాస్ క్యానిస్టర్లతో కన్పించారు. శుక్రవారం అరెస్ట్ చేసిన ఆందోళనకారులను విడిచిపెట్టినట్టు పోలీసులు తెలిపారు. శుక్రవారం నాటి ఆందోళనకు సంబంధించి కనీసం మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు చెప్పారు. ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సహా పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌తో పాటు పలువురు న్యాయవాదులు రెండో రోజు ఆందోళనలో పాల్గొన్నారు.
10న ఢిల్లీకి తరలిరండి: దీప్కే
ఢిల్లీకి పాదయాత్రను చేపట్టాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం ప్రకటించారు. జ్ఞానేశ్ కుమార్ కనుక రాజీనామా చేయకపోతే ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఆందోళనకు దేశవ్యాప్తంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అధికార ఎన్డీఏకి, విపక్ష ఆల్ ఇండియా కూటమికి మధ్య 2024లో కేవలం రెండు శాతం ఓట్ల తేడా మాత్రమ ఉందని, అయితే దాని మధ్య అంతరాన్ని పెంచడానికి ఎన్నికలకు 15 రోజుల ముందు జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా నియమించారని ఆరోపించారు. 40 లక్షల మంది కొత్త ఓటర్లను కలపడం ద్వారా బీజేపీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని అపహరించిందన్నారు. అదేవిధంగా కేజ్రీవాల్ పోటీచేసిన స్థానంలో 40 వేల ఓట్లను తొలగించారని, దీంతో ఆయన 4 వేల తేడాతో ఓటమి చెందారన్నారు. తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ నియోజకవర్గంలో లక్ష ఓట్లు తొలగించగా, ఆయన 10 వేల ఓట్ల తేడాతో ఓడారని అన్నారు.
నా ఎక్స్ ఖాతాను తొలగిస్తారేమో
తమ ఆందోళనకు బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మద్దతు తెలిపిన క్రమంలో ఆమెకు కృతజ్ఞతలు చెబుతూ దీప్కే పెట్టిన పోస్ట్‌ను ఎక్స్ నిరోధించింది. దీనిపై ఆయన స్పందిస్తూ అక్టోబర్ 10 కన్నా ముందే తన ఎక్స్ ఖాతాను తొలగించినా తాను ఆశ్చర్యపోనని తెలిపారు.