విశ్వనగరాన్ని తాగునీటి సమస్య అలుముకుంటున్నది. ఎల్‌నినో, వర్షాభావం వల్ల మరికొద్ది రోజుల్లో వేసవిని తలపించే పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయి. నగర ప్రజలు ట్యాంకర్ల వైపు చూస్తున్నారు. లోప్రెషర్, సరఫరాలో అంతరాయం ప్రారంభమైంది. ఇప్పటికే వర్షాకాలం చరమాంకానికి చేరుకోవడం, వర్షాలు సాధారణం కంటే అతి తక్కువగా కురియడంతో భవిష్యత్తులో నీటి సమస్యలు తారాస్థాయికి చేరుకోనున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌కు నీళ్లందించే ప్రధానమైన జలాశయాల్లో నీటి మట్టాలు క్రమంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీళ్లు మరో రెండు నెలలకు మించి అందే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే సింగూరు, గండిపేటలోని ఉస్మాన్ సాగర్‌లో నీటి మట్టాలు వేగంగా తగ్గుతున్నాయి. ఆ మేరకు జలమండలి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నీటి ఎద్దడి ఏర్పడితే సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రాంతాలను గుర్తించి అధిగమించేందుకు ముందస్తు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది.
సిటీ బ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ):ఎల్‌నినో ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లోను వర్షాలు సమృద్ధిగా కురవకపోవడం గ్రేటర్ హైదరాబాద్‌కు శాపంగా మారింది. ముఖ్యంగా సింగూరు, మంజీరా, జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు వరద నీరు వచ్చి చేరలేదు. ఆయా రిజర్వాయర్లలో నీటి మట్టాలు సాధారణ స్థాయికే పరిమితమయ్యాయి. గతేడాది కంటే తక్కువగా నమోదయ్యాయి. గండిపేటలోని ఉస్మాన్‌సాగర్ జలాశయం పరిస్థితి ప్రమాదకరంగా మారిం ది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా గతేడాది ఈసమయానికి నీటి మట్టం 1789.25 అడుగులు ఉండగా ప్రస్తుతం 1783 అడుగుల వరకు ఉన్నది. ఈ జలాశయం నుంచి ప్రతిరోజు నగరానికి 113 ఎంఎల్జీల నీటిని తరలిస్తున్నారు. వర్షాలు పడకపోవడంతో పాటు పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడే పరిస్థితులు వేసవిని తలపిస్తున్నాయి. దీంతో మరో రెండు నెలల్లో ఉస్మాన్‌సాగర్ నుంచి నీటిని తరలించడం కష్టమవుతుంది.
ఆందోళనకరంగా సింగూరు జలమట్టం..
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురియకపోవడంతో సింగూరు జలాశయం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సింగూరు పూర్తిస్థాయి నీటి మట్టం 1717.932 అడుగులు. గతేడాది ఈ సమయానికి 1709. 549 అడుగులు ఉండగా ప్రస్తుతం అది మరింత తగ్గి 1689.879 అడుగులకు చేరుకున్నది. గతేడాదితో పోలిస్తే ఈసారి జలమట్టం 20 అడుగుల దిగువన ఉన్నది.
మరో 3 అడుగుల దిగువకు చేరుకుంటే గ్రావిటీ ద్వారా నీటి సరఫరా నిలిచిపోతుంది. దీంతో సింగూరులో ఎమర్జెన్సీ పంపింగ్ అనివార్యమవుతుంది. పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే మరో వారం, పదిరోజుల్లో ఎమర్జెన్సీ పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈమేరకు జలమండలి అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వర్షాలు కురియకపోవడం, ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తుండటంతో నీటి మట్టాలు మరింత వేగంగా పడిపోయే ప్రమాదముంది. దీంతో నగరానికి నీటి కష్టాలు అతితొందరలోనే రాబోతుండటం ఆందోళన కలిగిస్తున్నది.