మహబూబ్‌నగర్, ఆక్టోబర్ 3 : భూ తగాదా విషయంలో మనస్తాపం చెందిన ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. కోయిలకొండ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాలు.. కోయిలకొండ మండలం పారుపల్లికి చెందిన రైతు పసుల లావప్ప (50)కు కొడుకులు వేణుగోపాల్, కుర్మయ్య, గంగాధర్‌తోపాటు కూతురు నాగేశ్వరమ్మ ఉన్నది. లావప్ప భార్యలు గతంలోనే మృతిచెందారు. పార్పల్లి శివారులోని సర్వే నంబర్ 211లో లావప్పకు వంశపారంపర్యంగా వచ్చిన 19 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది.
ఇం దులో 18 ఎకరాలు మాత్రమే పొజిషన్లో ఉండటంతో ఎకరా భూమికి సంబంధించి దాయాదుల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నది. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోకపోవడం, దాయాదులు బెదిరింపులకు పాల్పడటంతో మనస్తాపం చెందిన లావప్ప శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌నోట్ ప్రకారం లావప్ప కుమారుడు.. చంద్రశేఖర్, లక్ష్మయ్య, రామకృష్ణపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.