హైదరాబాద్ నగరంలో రూ.24 వేల కోట్లతో ప్రతిపాదించిన మెట్రో రైలు విస్తరణకు ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు.
గతంలో సొంత నిధులతో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన హెచ్ఎండీఏ ఖజానా ఇప్పుడు దివాలా తీసినా సర్కారు నిధులిచ్చి ఆదుకునే ప్రయత్నం చేయలేదు.
బీఆర్ఎస్ హయాంలో చేసినట్టుగా కీలకమైన ఐటీ కారిడార్‌లో రోడ్లు, వంతెనలు, నాలాల వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దగా ప్రాధాన్యం కల్పించలేదు.
ఏడాది కాలంగా ప్రభుత్వం ఊదరగొడుతున్న ఫ్యూచర్‌సిటీ వైపునైనా రియల్ఎస్టేట్ రంగం వృద్ధి చెందేలా కేటాయింపులు చేయకుండా రూ.100 కోట్లతో సరిపెట్టారు.
కూల్చివేతలే ఏకైక కార్యక్రమంగా అటు రియల్టర్‌ను, ఇటు కొనుగోలుదారుడిని బెంబేలెత్తిస్తున్న హైడ్రాకు మాత్రం వంద కోట్ల రూపాయలు కేటాయించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఆస్తిపన్ను ద్వారా అధిక ఆదాయాన్ని ఆశిస్తున్నట్టు పేర్కొనడం ద్వారా అటు ఇంటి యజమానులపై, కొనుగోలుదారులపై భారం మోపుతున్నట్టు సంకేతాలిచ్చారు.
ప్రభుత్వం తీరు ఇట్లా ఉంటే ఇక హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ కోలుకోవడం ఎట్లా? ఇదీ ఇప్పుడు రియల్టర్ల ప్రశ్న!
Real Estate | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 19 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ మహా నగరంలో రియల్ఎస్టేట్ రంగం కోలుకునే అవకాశం లేదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. గతమెంతో ఘనం… వర్తమానం శూన్యం… భవిష్యత్తు అయోమ యం… అన్నట్టుగా హైదరాబాద్ మహా నగర రియల్ఎస్టేట్- నిర్మాణరంగాల పరిస్థితి తయారైంది. ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చడమే కాకుండా బహిరంగ మార్కెట్లోకి కరెన్సీని జొప్పించి నగదు ప్రవాహాన్ని పెంచడంలో రియల్ఎస్టేట్, నిర్మాణ రంగాలు కీలకపాత్ర పోషిస్తాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రంగం నేలచూపు చూడటంతో తొలుత పార్లమెంటు ఎన్నికల ప్రభావమని సర్కారు సర్దిచెప్పింది. అయితే, క్షేత్రస్థాయిలోని వాస్తవాలతోపాటు వివిధ సర్వేలు సైతం చేదునిజాన్ని వెల్లడించినా పాలకుల్లో మార్పు రావడం లేదనేందుకు తాజా బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం. మహా నగరంలో మౌలిక వసతుల కల్పనకు గత బడ్జెట్లోని అంకెలను ఈసారీ పునరావృతం చేయడం మినహా నగరాభివృద్ధిని పరుగులు పెట్టిస్తామనే భరోసాను కల్పించలేకపోయారు.
దేశంలోని మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో వృద్ధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంతకాలం ఒక మోస్తరుగానే ఉండేది. ముంబై, బెంగళూరు, పుణె, ఢిల్లీ వంటి నగరాలు ఒకదానితో ఒకటి పోటీ పడేవి. కానీ, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ పాలనాపగ్గాలు స్వీకరించడంతో హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పన ప్రారంభమైంది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలతో ఐటీ రంగంలో ఎగుమతుల విలువ రూ.59 వేల కోట్ల నుంచి రూ.2.7 లక్షల కోట్లకు పెరగడంతోపాటు టెకీల సంఖ్య మూడు లక్షల నుంచి పది లక్షలకు చేరింది. దీనికితోడు క్రమంగా నగరంతోపాటు శివారు ప్రాంతాలకు మౌలిక వసతుల విస్తరణ, రవాణా వ్యవస్థ బలోపేతం కావడంతో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. తద్వారా ఆఫీస్స్పేస్తోపాటు రియల్ఎస్టేట్, నిర్మాణ రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరిగేందుకు దోహదపడింది. పదుల సంఖ్యలో ఫ్లెఓవర్లు, నగరం నలుమూలలా విశాలమైన లింకు రోడ్లు, జనాభా అవసరాలకు తగ్గట్టుగా పుష్కలమైన తాగునీటి సరఫరా, 24 గంటల కరెంటుతోపాటు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మానవీయ కార్యక్రమాలతో హైదరాబాద్ మహానగరం రియల్ఎస్టేట్, నిర్మాణరంగాల్లో దేశంలోని ఇతర మెట్రో నగరాలను వెనక్కి నెట్టి వృద్ధిని నమోదు చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహా నగరంలో మౌలిక వసతులకు సంబంధించి ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మొదలు కాకపోవడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేయడం, గతంలోని ప్రణాళికలన్నింటినీ చెల్లాచెదురు చేసి కొత్త పేర్లతో తిరిగి వాటిని చేపట్టేందుకు మళ్లీ ప్రతిపాదనలు తయారుచేయడంతో అధికార యంత్రాంగంలోనూ అయోమయానికి దారితీసింది. దీనికితోడు అత్యంత కీలకమైన ప్రతికూల పరిణామంగా హైడ్రాను తెరపైకి తెచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా నిరుపేదల ఇండ్లను కూల్చివేయడంతో రియల్ఎస్టేట్, నిర్మాణ రంగం తల్లడిల్లింది. చివరకు బిల్డర్లు ఆత్మహత్య చేసుకునే విషమ పరిస్థితులు రావడంతోపాటు హైడ్రా మూలంగా బిల్డర్లకు తాము రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు చేతులెత్తేయడంతో సమాజంలోకి ఎలాంటి సంకేతాలు పోయాయో అర్థం చేసుకోవచ్చు.
గత బడ్జెట్లో మౌలిక వసతుల కల్పనకు కేటాయించిన నిధుల్లో పావు వంతు కూడా విడుదల చేయని కాంగ్రెస్ ప్రభుత్వం… తాజా బడ్జెట్లోనూ మౌలిక వసతులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లాంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడంతో రానున్న ఏడాదిలోనూ మౌలిక వసతుల కల్పన పెరగడం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు, ప్రభుత్వం అక్రమ నిర్మాణాలంటూ బుల్డోజర్లతో విరుచుకుపడుతున్న హైడ్రాకు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించడం గమనార్హం. గత ఏడాది కాలంగా ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు నిత్యం గొప్పగా చెప్పుకుంటున్న ఫ్యూచర్సిటీకైనా మౌలిక వసతులకు భారీ కేటాయింపులు ఉన్నాయా? అంటే బడ్జెట్లో కేవలం రూ.100 కోట్లతో సరిపెట్టడంతో ఇక రియల్ఎస్టేట్, నిర్మాణ రంగాలు కోలుకునే పరిస్థితి ఇప్పట్లో లేదని పలువురు పెదవి విరుస్తున్నారు.
రియల్ఎస్టేట్ రంగం మరింత కుప్పకూలే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉన్నది. ఏడాదిన్నరగా రియల్ఎస్టేట్ రంగంలో క్రయవిక్రయాలు అట్టడుగు స్థాయికి చేరడంతో ఆర్థికంగా కుదేలైంది. ఐటీ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరానికి కనీసం మౌలిక వసతులను మెరుగుపరిచే విధంగా నిధులు కేటాయించలేదు. ఫోర్త్‌సిటీ నిర్మాణం రూ.100 కోట్లతో సాధ్యం కాదు. కుప్పకూలిన రియల్‌ఎస్టేట్‌ను ప్రభావితం చేసే చర్యలు చేపట్టాల్సింది పోయి, దేనికీ సరిపోని విధంగా నిధులు కేటాయించడమంటే ఈ రంగాన్ని దెబ్బతీయడమే. ఎంతోమందికి ఉపాధినిచ్చే రియల్ఎస్టేట్ రంగం నిర్వీర్యమైపోతుండగా, ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తు మరింత దారుణంగా మారుతుంది. బడ్జెట్లో రియల్‌ఎస్టేట్‌ను ఉద్దరించేలా ప్రోత్సాహకాలు, ఈ రంగంపై ఆధారపడిన వారికి సంక్షేమ పథకాలను కూడా ప్రతిపాదించలేదు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలపై పునరాలోచన చేసుకోవాలి. – నారగోని ప్రవీణ్, ప్రెసిడెంట్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్