Telangana | ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో నిత్యం కరెంట్ కోతలే. ప్రతిరోజూ వందలాది మంది దేశ, విదేశీ ప్రముఖులు పర్యటించే ఆ నగరంలో కరెంట్ కట్ నిత్యకృత్యం. రోజులో ఆరునుంచి ఏడు గంటలపాటు పవర్ కట్ పరిపాటే. 68 ఏండ్ల క్రితమే ఏర్పడిన ఆ రాష్ట్రంలో నేటికీ వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఓ కలే. బీజేపీ తొమ్మిదేండ్లు, కాంగ్రెస్ 40 ఏండ్లు పాలించినా కర్ణాటకలో కరెంట్ కోతలతో ప్రతిరోజూ జనం అల్లాడాల్సిందే. రోజులో 4 గంటలకు కరెంట్ కోతలను పరిమితం చేస్తామని చెప్పి బీజేపీని గద్దెదించి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికీ కోతలను అదుపుచేయడంలో విఫలమవుతున్నది. నమ్మి ఓటేసిన రాష్ట్ర ప్రజలకు ‘హస్తం’ పార్టీ పట్టపగలే చుక్కలు చూపిస్తున్నది. ఇది కర్ణాటక పరిస్థితే కాదు.. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇదే దుస్థితి. కరెంట్ కోసం ప్రతిరోజూ ఎదురుచూడాల్సిన పరిస్థితి.
కానీ తెలంగాణలో అటు రైతులకు, ఇటు ప్రజలకు కరెంట్ కష్టాల మాటే లేదు. స్వరాష్ట్రంలో కరెంట్ బాధలు పూర్తిగా తొలగిపోయాయి. అన్నదాతలు అర్ధరాత్రి పంటలకు నీళ్లు పెట్టేందుకు పొలాలకాడ పడుకోవాల్సిన బాధలు తప్పాయి. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తుండడంతో రైతులకు సాగునీటి బాధలు లేకుండా పోయాయి. కనురెప్ప కొట్టినంతసేపుకూడా కరెంట్ కోత లేకపోవడంతో ఒక్క వ్యవసాయమే కాదు.. పరిశ్రమలు, విద్యుత్తు ఆధారిత వ్యాపారాలు ఫుల్ జోష్‌లో నడుస్తున్నాయి. కోతలు లేకపోవడంతో తమ వ్యాపారాలు లాభసాటిగా సాగుతున్నాయని వ్యాపారులు సంబుర పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కరెంట్ బాధలు తీరినయ్
నేను 30 ఏండ్లుగా లేత్ మిషన్ వర్క్ చేస్తున్న. మా నాన్న కూడా ఇదే పని చేస్తుండె. ఇన్నేండ్లు ఏ ఒక ప్రభుత్వమూ కరెంటు సమస్య గురించి ఆలోచించలేదు.. పరిషరించలేదు. తెలంగాణ వచ్చినంక ఏడాదిలనే కరెంట్ సమస్యలు చాలా వరకు తగ్గినయ్. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించింది. క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు అనే మాటే లేదు. లేత్మిషన్పై పని సులభమైంది. కరెంట్ ఉండడంతో పని చేయించుకొని తొందరగా ఇంటికి వెళ్తున్నరు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే మళ్లా పాతరోజులే వస్తయ్. అందుకే సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం.
– కడార్ల తిరుపతి, లేత్‌మిషన్ వర్కర్ (జగిత్యాల)
కాంగ్రెసోళ్లు అస్తే బతుకులు మళ్లీ ఆగమైతయ్
కాంగ్రెస్ హయాంలో అస్తవ్యస్త కరెంటు సరఫరాతో మాలాంటి చిరు వ్యాపారులు పడరాని పాట్లు పడ్డాం. మాది టిఫిన్ సెంటర్. అన్నింటికీ కరెంటే దిక్కు. గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుండెనో పత్తా ఉండేది కాదు. కరెంటు బాధలతోటి అర్ధరాత్రి దుకాణానికి వచ్చి అన్ని గ్రైండ్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు ఎలాంటి రందీ లేదు. మా టిఫిన్ సెంటర్ మంచిగా నడుస్తున్నది. సీఎం కేసీఆర్ పుణ్యమా అని మాలాంటి చిరువ్యాపారులకు ఇబ్బందులు లేకుండాపోయాయి. కాంగ్రెసోళ్లు అస్తే మా బతుకులు మళ్లీ ఆగమైతయ్. అది ఊహించుకుంటనే భయం వేస్తున్నది.
-రాజు, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, బాన్సువాడ, కామారెడ్డి
గల్లీకో ట్రాన్స్ఫార్మర్ బిగిస్తున్నారు
పిండిగిర్నితోనే నా జీవితం సాగుతున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకు దెరువుకు ఇబ్బంది ఉండడం లేదు. నిరంతర కరెంటుతో గిరాకీ బాగున్నది. గతంలో కరెంటు లేక ఖర్చులు తీరే పరిస్థితి ఉండేది కాదు. ఎండాకాలం వచ్చిందంటే కరెంట్ ఎప్పుడు పోతదో, ఎప్పుడు ఉంటదో తెలిసేది కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నరు. కాంగ్రెస్ నాయకుల మాటలు అస్సలు నమ్మొద్దు. వాళ్లను నమ్మి మళ్లీ మోసపోవద్దు. కేసీఆర్ ఉంటే కరెంటు బాధలు ఉండవు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంట్ కోతలు ఉంటయి.
– వెల్దండి రత్నమాల, పిండిగిర్ని నిర్వాహకురాలు, హన్మకొండ
టైమ్‌కు ఆర్డర్లు ఇవ్వగలుగుతున్నాం
సిర్గాపూర్‌లో కార్పెంటర్ వర్క్ చేస్తూ జీవిస్తున్నా. ఈ పనికి కరెంటు అత్యవసరం. లో వోల్టేజీ సమస్యలు లేకుండా నిరంతరం కరెంటు వస్తున్నది. మా వర్క్ సాఫీగా కొనసాగడంతో లాభాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు కుటుంబ పరిస్థితులు మెరుగుపడ్డాయి. తెలంగాణ రాక ముందుతో పోలిస్తే ఇప్పుడు కరెంట్ చాలా మంచిగా ఇస్తున్నారు. కరెంట్ మంచిగ అస్తుండడంతో అన్ని వ్యాపారాలు మంచిగా సాగుతున్నాయి. వర్కర్లకు కూడా పనిదొరుకుతున్నది. మా పక్కన కర్ణాటకలో కరెంట్ గంటల పాటు పోతున్నదట. అక్కడి నుంచి వచ్చిన వాళ్లు మాతో చెబుతున్నారు. తెలంగాణల మంచిగ కరెంట్ ఇస్తున్నరని కర్ణాటక వాళ్లు అంటున్నారు. మాకు ఆర్డర్లు కూడా పెరిగినయి. సమయానికి ఆర్డర్లు కస్టమర్లకు ఇస్తున్నాం.
-వడ్ల అశోక్, కార్పెంటర్, సిర్గాపూర్ (సంగారెడ్డి జిల్లా)
కాంగ్రెస్ వస్తే కరెంట్ ఖతమే
కాంగ్రెస్ వస్తే రాష్ట్రంల కరెంట్ పని ఖతమే. తెలంగాణ రాక ముందు పరిస్థితి ఎట్లుండె. మళ్ల గదే చుక్కలు కనిపిస్తయి. రాష్ట్రం వచ్చినంక కేసీఆర్ సార్ నాణ్యమైన కరెంట్ ఇస్తున్నరు. మాలాంటి పరిశ్రమల నిర్వాహకులు లాభపడుతున్నరు. మహారాష్ట్రల వారానికి రెండ్రోజలు పరిశ్రమలు బంద్ పెడుతున్నరు. మనకు 2015నుంచే పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నరు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రూ.6.50లక్షల పెట్టి కొన్న జనరేటర్‌ను పక్కకు పడేసిన. కేసీఆర్ లాంటి లీడరే మనకుగావాలె.
– ఎండీ లతీఫ్, హుమెరా ఇండస్ట్రీ నిర్వాహకుడు, కరీంనగర్
కాంగ్రెస్ పాలనల కరెంటుకు గోసవడ్డం
కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ల వస్తే మళ్లా మా మీద బాగా భారం పడుతుంది. మా మెకానిక్ షాప్‌లు నడవాలంటే పొ ద్దంతా కరెం ట్ ఉండాలె. తెలంగాణ రాక మునుపు కాంగ్రెస్ పాలనల కరెంట్‌కు చానా గోసవ డ్డం. వాళ్ల్లతో ఏమీ కాదు. మా మెకానిక్‌లకు సీఎం కేసీఆర్ 24గంటలు కరెంటు ఇస్తున్నరు. గీ తెలంగాణ అచ్చినకంకనే మంచిగున్నది. ఇప్పు డు కరెంట్ పోతనే లేదు. కేసీఆర్ సారే గావాలె. కాంగ్రెసోళ్లు సరిగ్గా కరెంట్ ఇయ్యరు. మమ్మల్ని బతుకకుండా చేస్తరు. మేము మళ్లీ ఆగమవుతాం.
-తోత్తాల గణేశ్, కారు మెకానిక్ రామాయంపేట (మెదక్ జిల్లా)
లాభాల్లోకి పౌల్ట్రీ పరిశ్రమ
మా ప్రాంతంలో వ్యవసాయం తర్వాత పౌల్ట్రీ రంగమే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది. గత ప్రభుత్వాలు సరిగా కరెంటు ఇవ్వక పరిశ్రమలు సంక్షోభాన్ని ఎదుర్కొన్నయ్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పౌల్ట్రీ పరిశ్రమ లాభాల బాటపట్టింది. 24 గంటలు నిరంతర కరెంటు సరఫరా చేస్తున్నరు. యూనిట్‌కు రెండు రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటున్నరు. సీఎం కేసీఆర్ పౌల్ట్రీ పరిశ్రమను పట్టాలెక్కించి జనరేటర్ల సప్పుళ్లను బంద్ చేయించిన్రు. కాంగ్రెస్, బీజేపీని నమ్ముకుంటే మళ్లీ కరెంట్ కోతలతో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలబాట పడుతుంది. అందుకే సీఎం కేసీఆర్ వెంటే నడుస్తం.
-మొద్దు అంజిరెడ్డి, రైతు, శేరిగూడ (రంగారెడ్డి)
నాడు కస్టమర్లతో రోజూ లొల్లే
20 ఏండ్ల సంది టీవీ, మోటర్ల మెకానిక్‌గా పనిచేస్తూ షాపు నిర్వహిస్తున్న. తెలంగాణ ఏర్పడక ముందు షాపు అస్సలు నడిచేది కాదు. కరెంట్ ఉంటనే ఏదైనా పని. ఇగ రిపేర్లు సమయానికి పూర్తి కాకపోవడంతో కస్టమర్లతో గొడవలయ్యేవి. ఇదంతా కరెంట్ కోతల వల్లే. తెలంగాణ వచ్చినంకనే కరెంటు ఫుల్లుగా ఉంటున్నది. కస్టమర్లకు చెప్పిన సమయానికి టీవీలు, మోటర్లను రిపేర్ చేసి ఇస్తున్న. ఈ తొమ్మిదేండ్లలో ఎంతో సంతోషంగా ఉన్నం. మళ్లీ కాంగ్రెసో, బీజేపో చెప్పిన మాటలు నమ్మితే మొదటికే మోసం వస్తది. మళ్లీ కరెంటు కష్టాలు మొదలైతయ్.
– ఎలిగేటి ఉపేందర్, మోటర్లు, టీవీ మెకానిక్, గోలేటి టౌన్షిప్, రెబ్బన
విద్యుత్తు సమస్యలే లేవు
నేను 12 ఏండ్ల నుంచి జిరాక్స్ షాపు, ఫొటో స్టూడియో నడుపుతున్న. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు కరెంటు సరిగా ఉండక వ్యాపారం నడిచేది కాదు. కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియక ఇబ్బందులు పడేవాన్ని. కనీసం కూలి కూడా పడేది కాదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినంక కరెంట్ కోతలు లేకుండా పోయినయ్. ఇప్పుడు వ్యాపారం మంచిగ నడుస్తున్నది. ఫొటోలు, జిరాక్స్ కోసం వచ్చిన కస్టమర్లకు సకాలంలో సేవలు అందిస్తున్న. ఇదంతా సీఎం కేసీఆర్ సార్‌తోనే సాధ్యమైంది. కాంగ్రెస్, బీజేపీ వాళ్లతో నిరంతరం విద్యుత్తు ఇవ్వడం సాధ్యం కాదు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కరెంట్ కోతల మీద నిత్యం వార్తలు వస్తనే ఉన్నయ్.
-పత్తెం రాజు, ఫొటో స్టూడియో, జిరాక్స్ సెంటర్, రెబ్బెన (కుమ్రంభీం ఆసిఫాబాద్)
కాంగ్రెస్ అస్తే కరెంటు అటే పోతది
సీఎం కేసీఆర్ సార్ పుణ్యమా అని కరెంట్ కష్టాలు లేకుండ పోయినయ్. కాంగ్రెసోళ్లు ఉన్నప్పుడు కరెంట్ సక్కగా ఉండకుండే. పొద్దున పోతే ఏ రాత్రికో అస్తుండె.. కేసీఆర్ సార్ అచ్చినంక కరెంట్ ఫుల్‌గా ఇస్తుండ్రు. మళ్ల మా రజకులకు ఫ్రీగా కరెంట్ ఇస్తుండ్రు. అదే కరెంట్‌తో బట్టలు ఇస్త్రీ చేస్తున్నం. రోజు మంచిగా ఆదాయం అస్తున్నది. మళ్ల కేసీఆర్ సార్ ప్రభుత్వమే అస్తది. ఆయనే రావాల. అందరి గురించి మంచిగా ఆలోచన చేసే సార్ కేసీఆర్. కాంగ్రెస్ అస్తే కరెంట్ రాదు అటే పోతది. మళ్లా చీకట్ల ఉండాల్సి అస్తది. మేము మళ్లా కేసీఆర్ సార్కే మద్దతిస్తాం..
– సత్యనారాయణ, రజకుడు, కోటగిరి, నిజామాబాద్ జిల్లా.
లాభాల బాటలో రైస్‌మిల్లులు
సమైక్య పాలనలో కరెంట్ కోతలు, లో వోల్టేజీతో అనేక నష్టాలు చూశాం. అప్పుడున్న వరి ఉత్పత్తి, కరెంట్ కోతలతో రైస్ మిల్లులు, పారాబాయిల్డ్ మిల్లులు కుదేలయ్యాయి. రాష్ట్రంలో 3,500 పారాబాయిల్డ్ మిల్లులు, 10 వేల వరకు రైస్ మిల్లులు ఉండగా కరెంట్ సరఫరా సక్రమంగా లేక పది రోజుల్లో చేయాల్సిన పనిని నెలరోజులు చేసేది. దీంతో సమయంతోపాటు అధిక వ్యయం అయ్యేది. లాభాలు లేక అనేక రైస్ మిల్లులు మూతపడ్డాయి. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్తు సరఫరా మెరుగుపడటంతో రైస్ మిల్లులు లాభాల బాటపట్టాయి. 24 గంటలపాటు మిల్లింగ్ చేసుకుంటున్నాం. వేతనాలు, అద్దెలు, విద్యుత్తు సరఫరా భారాలు తప్పాయి. దీనికి తెలంగాణ ప్రభుత్వ పనితీరే కారణం.
-మోరపల్లి తిరుపతిరెడ్డి, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, పెద్దపల్లి
ఆ బాధలు చెప్పుకుంటే ఒడిసేవి కాదు
ఫ్యాన్లు, మిక్సీలు, కూలర్లు, విద్యుత్తు మోటార్ల మెకానిక్ పనిని నేర్చుకొని సొంతంగా 12 ఏండ్ల క్రితం మెకానిక్ షాపు పెట్టుకున్నా. తెలంగాణ రాకముందు గంటల తరబడి కరెంటు పోయేది. రిపేర్ కోసం ఫ్యాన్లు, మిక్సీలు, కూలర్లు, మోటార్లు రిపేర్ కోసం ఇచ్చిన వాళ్లకు కరెంటు కోతలతో అనుకున్న సమయానికి చేయకపోయేది. దీంతో వారు షాపు కాడికొచ్చి లొల్లి పెట్టేటోళ్లు. వారి బాధ భరించలేక షాపు మూసి ఇంటికెళ్లేటోన్ని. కొందరైతే మా ఇల్లు ఎక్కడో తెలుసుకొని ఇంటికొచ్చి కూడా లొల్లి పెట్టేటోళ్లు. జనరేటర్ సౌలత్ ఉన్న వారి దగ్గరికి గిరాకీ పోయేది. గిరాకీ మీద కూడా బాగా దెబ్బపడేది. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సార్ 24 గంటలు కరెంటు ఇస్తున్నడు. రిపేర్లకు ఎప్పుడు వస్తే అప్పుడే ధన్మని చేసి ఇస్తున్నం. తెలంగాణ రాకముందు కరెంటు కోసం పడ్డ బాధలు చెప్పుకుంటే ఒడిసేవి కాదు. ఆ బాధలన్నీ ఇప్పుడు తీరిపోయి మంచిగ కరెంటు వత్తాంది. ఇట్ల ఎప్పటికీ కరెంటు ఉండాలంటే మళ్లీ కేసీఆర్ సారే తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉండాలే. కరెంటు ఉండడం వల్ల నాలాంటి వాళ్లు ఎంతో మంది మంచిగ పని చేసుకొని బతుకుతుండ్లు. గిరాకి పెరగడంతో ఇంకో మనిషిని కూడా పెట్టుకున్న.
– కుర్రె శ్రీనివాస్, విద్యుత్తు పరికరాల మెకానిక్, సుభాష్ కాలనీ, భూపాలపల్లి
కేసీఆర్ ఉంటేనే కరెంటు కష్టాలు రావు
2014 వరకు కరెంటు సరఫరా పరిస్థితి దారుణంగా ఉండేది. రోజూ కోతలే. కూలి పడుతలేదని లేబర్ ఇతర పనులు చూసుకునేది. ఇండస్ట్రీ మొత్తం నష్టాల్లో మునిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగానికి మంచి రోజులొచ్చాయి. 2014కు ముందు రాష్ట్రంలో 68 కోల్డ్ స్టోరేజీలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 123 దాటింది. ఒక్క వరంగల్‌లోనే కోల్డ్ స్టోరేజీలు 10 నుంచి 24కు పెరిగాయి. మా కోల్డ్ స్టోరేజీలో ఇప్పుడు బీహార్‌కు చెందిన వంద మంది లేబర్ పర్మినెంటుగ పనిచేస్తున్నరు. అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నరు. కేసీఆర్ ఉంటేనే కరెంటు కష్టాలు రావు.
– తోట నర్సింగం, కోల్డ్ స్టోరేజీ యజమాని, వరంగల్
నాడు ఇండస్ట్రీలు క్లోజ్
నాడు కరెంటు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కరెంటు కోతలతో పరిశ్రమలు సరిగ్గా నడిచేవి కాదు. కుటుంబాలు గడవడం లేదని లేబర్ బాధపడేటోళ్లు. ఇక లాభం లేదని వలస పోయేది. పరిశ్రమల యజమానులకు మెయింటనెన్సు ప్రాబ్లమ్ అయ్యేది. చివరకు చాలామంది ఓనర్లు తమ ఇండస్ట్రీలను మూసేసిండ్లు. స్వరాష్ట్రంలో విద్యుదుత్పత్తిని పెంచుతూ సప్లయ్‌ని మెరుగుపరుచడంతో పారిశ్రామికరంగం కోలుకోవడం మొదలైంది. మహారాష్ట్ర, బీహార్ రాష్ర్టాల నుంచి కూలీలు పెద్ద సంఖ్యలో తెలంగాణకొచ్చి పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నరు. ఇండస్ట్రీకి ఇపుడు కరెంటు సమస్య అనేదే లేదు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ రాకుంటే మునుపటి పరిస్థితే.
– శ్రీరాం రవి, కాటన్ ఇండస్ట్రీ యజమాని, గొర్రెకుంట, వరంగల్