నిజాంసాగర్: కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజాంసాగర్ (Nizamsagar) జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి 2,31,363 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 1,99,244 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి వదుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు. ప్రస్తుతం 1404 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. జలాశయంలో 17.802 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. ప్రస్తుతం 16.472 టీఎంసీల నీరు ఉన్నది. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, మంజీరా నదిలోకి దిగవద్దని సూచించారు.
జక్కల్ పరిధిలోని కౌలాస్ నాలా జలాశయంలోకి భారీగా వరద వస్తున్నది. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో 30,682 క్యూసెక్కుల వరద కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నది. దీంతో ఆరు గేట్లు ఎత్తి మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిట్టం 458 మీట్లు కాగా, ప్రస్తుతం 457.80 మీటర్లు ఉన్నది. ఇక జలాశయంలో గరిష్ట నీటి నిల్వ1.237 టీఎంసీలకుగాను ఇప్పుడు 1.188 టీఎంసీల నీరు ఉన్నది.