హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ): 22ఏ సమస్య పరిషారంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు జారీచేస్తున్న నిరభ్యంతర పత్రాలను (ఎన్వోసీ) సబ్ రిజిస్ట్రార్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చట్టపరంగా కలెక్టర్ ఇచ్చే ఎన్వోసీల ఆధారంగా నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ చేసే అధికారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగానికి ఉన్నప్పటికీ, సాకులు చూపుతూ ఎస్ఆర్వోలు తిప్పి పంపుతున్నారు. చెంగిచర్లలోని 500 గజాల ప్లాట్‌కు కలెక్టర్ ఎన్వోసీ ఇచ్చినా నేటికీ అది రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోవడమే ఇందుకు నిదర్శనం. నిషేధిత జాబితాపై కోర్టు తీర్పులను కూడా అధికారులు ఖాతరు చేయడం లేదని న్యాయ నిపుణులు మండిపడుతున్నారు.
అధికారులు, నేతల వసూళ్ల పర్వం
ప్రభుత్వ పెద్దల మాటలకు, అధికారుల చేతలకు పొంతన లేకుండా పోయిందని తెలంగాణ రియల్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. నిషేధిత జాబితా మాటున అధికారులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. కలెక్టర్ల ఎన్వోసీలకు కూడా విలువ ఇవ్వకపోతే బాధితులకు కోర్టులే శరణ్యమవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే ఈ నిషేధిత జాబితాను ఎత్తివేయాలని కోరారు.