హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): యూరియా కొరతతో అష్టకష్టాలు పడిన అన్నదాతలను మరో కష్టం వెంటాడుతున్నది. ఈ వానకాలం సీజన్లో సర్కారుకు ధాన్యం అమ్మే రైతులకు సకాలంలో పైసలు రావడం గగనమేనని తెలుస్తున్నది. రెండు రోజుల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్తున్నా, అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులే కానవస్తున్నాయి. ఎన్ని రోజులకు వస్తాయో కూడా తెలియని అయోమయం నెలకొన్నది. నిధుల గండం పొంచి ఉండటమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. అవసరమైన నిధుల్లో కేవలం ఒక వంతు నిధులే అందుబాటులో ఉండగా, మూడోవంతు నిధుల సమీకరణకు సివిల్ సప్లయ్ ఆపసోపాలు పడుతున్నది. అప్పుల కోసం వెంపర్లాడుతున్నది. వానకాలం ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 1 నుంచే ప్రారంభించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 1205 కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
కానీ రైతులకు చెల్లించేందుకు అవసరమైన నిధులు మాత్రం సివల్ సప్లయ్ వద్ద లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వానకాలం సీజన్లో 148 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో సుమారు 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో సుమారు 40 లక్షల టన్నులు సన్న ధాన్యం వస్తుందని అంచనా. క్వింటాకు రూ.500 చొప్పున 40 లక్షల టన్నులకు రూ.2 వేల కోట్లు అవసరం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం క్వింటాకు మద్దతు ధర రూ.2,389గా ఉన్నది. దీంతో బోనస్‌తో కలిపి 80 లక్షల టన్నులకు రూ.21,112 కోట్ల నిధులు అవసరమవుతాయని సివిల్ సప్లయ్ అంచనా వేసింది. ఇందులో ప్రస్తుతం రూ.7 వేల కోట్లు మాత్రమే ఆ శాఖ వద్ద అందుబాటులో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో నాబార్డ్ రూ.3,800 కోట్లు రుణం మంజూరు చేయగా, గతంలో మంజూరైన రుణాల్లో రూ.3,200 కోట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నట్టు తెలిసింది. ఈ రెండూ కలిపితే రూ.7 వేల కోట్లే అందుబాటులో ఉండగా, ఇంకా రూ.14,112 కోట్ల నిధులు అవసరం కానున్నాయి.
అప్పుల కోసం వెంపర్లాట!
ధాన్యం కొనుగోళ్లకు రూ.14 వేల కోట్ల నిధులు తక్కువగా ఉండటంతో సివిల్ సప్లయ్ అధికారుల్లో ఆందోళన నెలకొన్నది. ఈ భారీ లోటును ఏ విధంగా భర్తీ చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. సర్కారు వైపు నుంచి ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అలవాటు మాదిరిగా మళ్లీ అప్పుల కోసం వేట మొదలుపెట్టినట్టు తెలిసింది. అప్పుల కోసం ఎక్కడపడితే అక్కడ అడుగుతున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆర్బీఐ నుంచి రూ.6,086 కోట్ల అప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయినా ఇంకా రూ.8 వేల కోట్లు కావాల్సి ఉన్నది. మార్క్‌ఫెడ్ ద్వారా ఎన్సీడీసీ రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన్పటికీ రుణం మంజూరు కాలేదని తెలిసింది.
అంచనాకు మించి ధాన్యం వస్తే?
ప్రభుత్వం 80 లక్షల టన్నుల కొనుగోలుకు ప్రణాళిక రూపొందించింది. దానికి మించి ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని సివిల్ సప్లయ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ప్రణాళికకు అధనంగా 20 లక్షల టన్నులు కోనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకే ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వం.. కోటి టన్నులు కొనుగోలు చేయాల్సి వస్తే పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రూ.21వేల కోట్లకు అదనంగా మరో రూ.5 వేల కోట్లు అవసరం కానున్నాయి. ఈ భారీ మొత్తం నిధులు సమకూర్చడం సవిల్ సప్లయ్‌కు సవాల్‌గా మారింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ధాన్యానికి డిమాండ్ పడిపోయింది. ఎగుమతులు లేక ప్రైవేటు వ్యాపారులు అధిక ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదని రైస్‌మిల్లు వర్గాలు చెప్తున్నాయి. దీంతో అధిక ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఉన్న పైసలు నెల రోజులకే..
ప్రస్తుతం సివిల్ సప్లయ్ వద్ద రుణాల రూపంలో ఉన్న రూ.7 వేల కోట్ల నిధులు కేవలం నెల రోజుల ధాన్యం కొనుగోలుకే సరిపోతాయి. ఈ నేపథ్యంలో నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో కొనుగోలు చేసే ధాన్యానికి నిధులెట్ల? అనే ఆందోళన సివిల్ సప్లయ్ అధికారుల్లో వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం ఉన్న రూ.7 వేల కోట్లు 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకే సరిపోతాయి. సివిల్ సప్లయ్ అంచనాల ప్రకారం అక్టోబర్‌లో 7 లక్షల టన్నులు, నవంబర్‌లో 33 లక్షలు, డిసెంబర్లో 27 లక్షలు, జనవరిలో 8 లక్షల టన్నుల చొప్పున ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఉన్న నిధులు నవంబర్ మధ్య వరకు సరిపోనున్నాయి. ఇక ఆ తర్వాత ధాన్యం విక్రయించే రైతుల పరిస్థితి ఏంటనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
1,159 కోట్ల యాసంగి బోనప్ బకాయి
గత యాసంగి బోనస్ బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ధాన్యం విక్రయించి 5 నెలలు దాటినా ప్రభుత్వం రైతులకు బోనస్ నిధులు చెల్లించనేలేదు. గత యాసంగిలో 4.09 లక్షల మంది రైతుల నుంచి 23.19 లక్షల టన్నుల సన్న ధాన్యం కొనుగోలు చేసింది. దీనికి క్వింటాకు రూ.500 చొప్పున రూ.1,159.64 కోట్లను రైతులకు బోనస్‌గా చెల్లించాల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు రైతులకు నయా పైసా చెల్లించలేదు. ఈ వానకాలం సీజన్లో 40 లక్షల టన్నుల సన్నాలు వస్తాయని అంచనా. ఇందుకోసం రూ.2 వేల కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులకు బోనస్ బకాయిలు రూ.3,159 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. రూ.1159 కోట్లు చెల్లించేందుకే ఐదు నెలలు సతాయిస్తున్న సర్కారు.. ఇక రూ.3,159 కోట్లు ఎప్పుడు చెల్లిస్తుందోనని అనుమానం ఉన్నది. అసలు చెల్లిస్తుందా? లేదా? అన్న అనుమానమూ రైతుల నుంచి వ్యక్తమవుతున్నది
ఇవీ వివరాలు
బోనస్ డబ్బుల కోసం రోడ్డెక్కిన రైతన్న
కోటగిరి, అక్టోబర్ 11: గత యాసంగిలో పండించిన సన్నవడ్లకు సంబంధించిన రూ.500 బోనస్ ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శనివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పండించి, మండుటెండలను లెక్క చేయకుండా వడ్లను ఆరబెట్టి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ఇప్పటికీ బోనస్ ఇవ్వలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. వర్షాకాలం పంట బోనస్పైన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ గంగాధర్, రుద్రూర్ ఎస్సై సాయన్న రైతుల వద్దకు వచ్చి సర్దిచెప్పబోయారు. రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వకుండా వర్షాకాలం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో మూడు కిలోల తరుగు రూపంలో దోపిడీ చేస్తున్నారని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల్లో బోనస్‌పై స్పష్టత ఇవ్వకపోతే మహాధర్నా ఉంటుందని అన్నదాతలు హెచ్చరించారు.