గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 01:51:23

‘బ్యూటీ’ఫుల్‌ డిమాండ్‌

‘బ్యూటీ’ఫుల్‌  డిమాండ్‌

  • l జూన్‌లో పుంజుకున్న కాస్మెటిక్స్‌ అమ్మకాలు
  • l కరోనా నేపథ్యంలో మారిన అభిరుచులు
  • l ట్రెండ్‌కు తగ్గట్టే కంపెనీల ఆలోచనలు
  • l ‘వర్క్‌  ఫ్రం హోం’ కిట్లు, క్లాసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మగువలకు ఇష్టమైనవి సింగారం.. బంగారం. పురుషుల్లోనూ ఈ మధ్య అందం మీద మక్కువ పెరిగింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కాస్మెటిక్స్‌ అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయి. బ్యూటీ ఇండస్ట్రీ మూడుపువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతున్నది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో మేకప్‌ వేసుకునే అవసరం తప్పింది. దాంతో కాస్మెటిక్స్‌ అమ్మకాలు పడిపోయాయి. ఆంక్షలు సడలించాక ఈ రంగం కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని అంతా భావించారు. కానీ నెల తిరక్కుండానే అమ్మకాలు పుంజుకున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. నీల్సన్‌ సంస్థ ఇటీవల విడుదల చేసిన సర్వే ప్రకారం జూన్‌లో కాస్మెటిక్స్‌ అమ్మకాల్లో అనూహ్య వృద్ధి కనిపించింది. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.

80 శాతం రికవరీ

గోల్డ్‌ స్టెయిన్‌ రిసెర్చ్‌ సంస్థ ప్రకారం దేశంలో ఏటా సుమారు రూ.95వేల కోట్ల కాస్మెటిక్‌ ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. అంటే సగటున నెలకు రూ.8 వేల కోట్లు. దేశంలో మే నెలలోనే ఆంక్షలు సడలించినా కాస్మెటిక్స్‌ అమ్మకాల్లో 49 శాతం లోటు నమోదైంది. జూన్‌లో మాత్రం అమ్మకాలు అనూహ్యంగా పుంజుకున్నాయి. మార్చితో పోల్చితే 80 శాతం వరకు అమ్మకాలు జరిగాయని పలు అధ్యయనాల్లో తేలింది. బ్యూటీపార్లర్లు, స్పాలు తెరుచుకోవటం, షూటింగ్‌లు మొదలవటం, ప్రజలు ఎక్కువగా బయట తిరుగుతుండటం ఇందుకు కారణాలుగా చెప్తున్నాయి.

కండ్లే మాట్లాడుతున్నాయ్‌ 

మూడు నెలల లాక్‌డౌన్‌ సమయంలో ఎవరూ అందంపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఇప్పుడు తరుచూ బయటికి వెళ్లాల్సి వస్తుండటంతో మళ్లీ సొగసు పెంచుకోవడంపై మగువలు దృష్టిపెట్టారు. మరోవైపు కాటుక, ఐలాష్‌కు ఆదరణ పెరిగింది. లిప్‌స్టిక్‌ వినియోగం తగ్గింది. ఓ సర్వే ప్రకారం కరోనాకు ముందు మేకప్‌కిట్‌లో లిప్‌స్టిక్‌కు మూడోస్థానం, ఐలాష్‌కు ఐదో స్థానం ఉండగా.. ఇప్పుడు తారుమారైంది. పెదవులను మాస్క్‌ కప్పేస్తుండటంతో లిప్‌స్టిక్‌పై పెద్దగా దృష్టిపెట్టడం లేదు. అందం మొత్తాన్ని కండ్లల్లోనే చూపిస్తున్నారట.

వర్క్‌ ఫ్రం హోం కిట్‌

ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం ట్రెండ్‌ నడుస్తున్నది. వర్చువల్‌ మీటింగ్స్‌ పెరిగిపోయాయి. ఎదురుగా కనిపించడానికి, వీడియోకాల్‌లో దృశ్యానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటున్నది. ఈ నేపథ్యంలో వెబినార్లు, వీడియోకాల్స్‌ సమయంలో మేకప్‌ కోసం ‘వర్క్‌ ఫ్రం హోం కిట్‌' పేరుతో ప్రత్యేకప్యాక్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీడియోకాల్‌లో అందంగా కనిపించాలంటే ఏ రంగు ఎంత వాడాలో చెప్తున్నాయి. ఇక స్పాలు, బ్యూటీ పార్లర్లు సైతం.. ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇంట్లో ఉండి మేకప్‌ ఎలా వేసుకోవాలో నేర్పిస్తున్నాయి. 


logo