శనివారం 04 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 17:32:28

తెలంగాణ రికార్డ్‌.. కోటి 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

తెలంగాణ రికార్డ్‌.. కోటి 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

  • ఆరేళ్లలో 367 శాతం పెరిగిన ధాన్యం కొనుగోళ్లు
  • గతేడాది యాసంగి కంటే 76 శాతం అధికం

హైదరాబాద్‌ : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కోటి 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి.. సరికొత్త రికార్డు నెలకొల్పింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించిన ఏడాది 2014-15లో వానాకాలం, యాసంగిలో కలిపి కేవలం 24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. ఇప్పుడేమో కోటి 12 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి, పట్టుదల, ముందుచూపు వల్లే ఇది సాధ్యమైంది. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా అవతరించబోతోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. 

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముగిసిన సందర్భంగా మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి పత్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 2019-20 ఏడాదిలో చరిత్రలో అత్యధికంగా రికార్డు స్థాయిలో వానాకాలంలో 47 లక్షల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కేవలం ఆరు సంవత్సరాల్లోనే 367 శాతం ధాన్యం కొనుగోళ్లు పెరిగాయన్నారు. గత యాసంగి కంటే ఈ ఏడాదిలో 28 లక్షల(76 శాతం) మెట్రిక్‌ టన్నులు అధికంగా కొనుగోలు చేసినట్లు శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. 

యాసంగిలో 6,408 కొనుగోలు కేంద్రాల ద్వారా 9.68 లక్షల మంది రైతుల నుంచి దాదాపు రూ. 12 వేల కోట్ల విలువ చేసే 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు రూ. 11 వేల కోట్లను రైతుల ఖాతాలో జమ చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యాసంగిలో 39 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అయినట్లు చెప్పారు. 

సీఎం కేసీఆర్‌ చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌ వల్లే సాధ్యమైందన్నారు. కరోనా లాక్‌డౌన్‌ కాలంలోనూ రైతాంగానికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు విజయవంతంగా జరిపించినట్లు మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. logo