Aasara Pensions | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ ప్రభుత్వం ఆసరా పింఛన్ అత్తకే ఇస్తున్నది.. కోడలుకు ఇస్తలేదు. మేము అధికారంలోకి వస్తే అత్తాకోడలు ఇద్దరికీ ఇస్తాం. ఇచ్చే రూ.2 వేల పింఛన్ రూ.4వేలకు పెంచుతాం. వికలాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతాం’. ఇవి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో, ఆరు గ్యారెంటీల్లోనూ ఇవే హామీలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా పింఛన్లు పెంచకపోగా, కొత్తగా పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లలోనే కోత పెడుతున్నారు. ప్రభుత్వం చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలో గణాంకాలకు పొంతన లేదు.
గడిచిన రెండున్నరేండ్ల గణాంకాలను పరిశీలిస్తే, సుమారు 2 లక్షల మందికిపైగా లబ్ధిదారులు ఈ పథకం నుంచి దూరమైనట్టు స్పష్టమవుతున్నది. ఇది ఎవరో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు కావు. ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ లెకలు చెప్తున్న నిజాలు. రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, ఫైలేరియా, బీడీ కార్మికులకు ఆసరాగా నిలువాలనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ ఆసరా పింఛన్ల పథకాన్ని తీసుకొచ్చింది. రూ.500 ఉన్న పింఛన్ మొత్తాన్ని క్రమంగా రూ.2 వేలకు పెంచింది. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్, ఆసరా పింఛన్ల పేరును చేయూతగా మార్చి లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెడుతున్నది.
అన్ని క్యాటగిరీల్లోనూ కోతలు
2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 43,15,981 మందికి పింఛన్లు అందాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం 52,23,755 కాగా, జనవరి వరకు 41,48,071 మందికే పరిమితమైంది. నిరుడితో పోలిస్తే ఈ ఏడాది సుమారు 1,67,910 మంది లబ్ధిదారులు తగ్గిపోయారు. ప్రతి క్యాటగిరీలోనూ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. వృద్ధాప్య పింఛన్లు 2025-26 లక్ష్యం 32.62 లక్షలు కాగా, 26.74 లక్షల మందికే అందాయి. గతంలో 83 వేల పైచిలుకు ఉన్న దివ్యాంగుల లబ్ధిదారుల సంఖ్య, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 79 వేలకు పడిపోయింది. బీడీ కార్మికులు, ఒంటరి మహిళల విభాగాల్లోనూ లక్ష్యానికి, క్షేత్రస్థాయికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తున్నది. ఎస్సీ, ట్రైబల్ సబ్‌ప్లాన్ కింద దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు ఇచ్చే పింఛన్లూ తగ్గించారు. జీవనభృతి కింద బీడీ కార్మికులకు ఇచ్చే పింఛన్ లబ్ధిదారుల సంఖ్యనూ తగ్గించడం గమనార్హం.
కొత్తవారికి అందని ‘చేయూత’
2025-26 జనవరి నాటికి ఈ పథకం కోసం వెచ్చించిన మొత్తం రూ.10,422.60 కోట్లుగా బడ్జెట్ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. లబ్ధిదారుల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వం, అనర్హుల ఏరివేత పేరుతో ఉన్నవారిని తొలగిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆసరాపై ఆధారపడ్డ సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. 2026-27 సంవత్సరానికి మళ్లీ 52 లక్షల మందికి ఇస్తామని కాగితాలపై లక్ష్యాలను చూపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పంపిణీ తగ్గిపోవడం గమనార్హం. వేల సంఖ్యలో కొత్త దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా, వాటిని పరిషరించడంలో జాప్యం చేస్తున్నది. బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వం విఫలం కావడం, నిరుటితో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్య తగ్గడం చూస్తుంటే.. పింఛన్ల విషయంలో ప్రభుత్వం కావాలనే కోత పెడుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
