బిజినేపల్లి/ చింతకాని/ఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ), మే 3 : ఆరుగాలం కష్టించి పండించిన పంటలు, ప్రేమగా పెంచుకున్న మూగజీవాలు అగ్నికి ఆహుతి కావడంతో రైతులు రోదిస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో మొకజొన్నకు ప్రమాదవశాత్తు నిప్పంటుకున్నది. పెనుగాలులకు మంటలు వ్యాపించి కల్లాల్లోని మొకజొన్న బస్తాలను చుట్టుముట్టాయి. ప్రమాదంలో 200 క్వింటాళ్ల మక్కలు బూడిదయ్యాయి.
అదే గ్రామానికి చెందిన ఒబినబోయిన వీరబాబు, చెవుల పుల్లయ్యకు చెందిన 30 గొర్రెలు మృతిచెందాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కనుగుట్టలో 60 ఎకరాల్లో 25 మంది రైతుల మక్క పంట అగ్నికి ఆహుతైంది. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లీపూర్కు చెందిన శ్రీనివాసులు రెండెకరాల్లో మక్క సాగు చేశాడు. ఆదివారం సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద మంటలు చెలరేగడంతో పంట కాలిబూడిదైంది. వడ్డెమాన్లో ఆంజనేయులుకు చెందిన 30 గుంటలు, స్వామికి చెందిన ఎకరన్నర పంట కాలిబూడిదైంది.