Parliament Elections | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో మార్చి 16 నుంచి జూన్ 3 వరకు పోలీసులు, తనిఖీ బృందాలు నిర్వహించిన సోదాల్లో రూ.200.27 కోట్లు దొరికినట్లు రాష్ట్ర పోలీసు విభాగం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పట్టుబడిన నగదు రూ.46.3 కోట్లు కాగా 2024 పార్లమెంట్ ఎన్నికల తనిఖీల్లో తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 149.54 కోట్లు.
ఇందులో రూ.99.16 కోట్ల నగదును అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. రూ.11.48 కోట్ల విలువైన మద్యం, రూ.14.52 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.63.19 కోట్ల విలువైన ఆభరణాలు, నగలు రూ.11.91 కోట్ల విలువైన ఇతర ఉచితాలు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,272 లైసెన్డ్స్ గన్స్ డిపాజిట్ చేయగా అక్రమంగా వాడుతున్న 20 గన్స్‌ను తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటితోపాటు 2,756 జిలెటిన్ స్టిక్స్, 401 డిటోనేటర్స్, 847 సాధారణ డిటోటేర్స్ వంటి పలు పేలుడు పదార్థాలు తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 466 ఫ్లయింగ్ స్కాడ్స్, 89 ఇంటర్‌స్టేట్ చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహించారు.