హాజీపూర్, సెప్టెంబర్ 3 : ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదటి విడత బిల్లు మంజూరు చేయించేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ పీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడికి చెందిన డొల్క నాగమణికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. బేస్మెంట్ లెవల్ వరకు పనులు పూర్తి చేసిన ఆమె లక్ష రూపాయల బిల్లు కోసం పంచాయతీ కార్యదర్శి పీ వెంకటస్వామిని సంప్రదించింది.
ఇంటి నిర్మాణ పనుల ఫొటో తీసి ఆన్లైన్లో నమోదు చేసేందుకు పంచాయతీ కార్యదర్శి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేయగా రూ.20 వేలకు ఒప్పందం కుదిరింది. బుధవారం నాగమణి ఇంటి వద్ద కార్యదర్శి వెంకటస్వామి లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యదర్శిని గ్రామ పంచాయతీ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ చేసి అరెస్టు చేసి కరీంనగర్‌కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
వినాయక్ నగర్, సెప్టెంబర్ 3: వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్టీ) ఫైల్ ముందుకు కదిపేందుకు మున్సిపల్ ఆర్ఐ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాళీ స్థలంలో జ్యూస్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. అతడు మున్సిపల్ కార్యాలయంలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్టీ) నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
నంబర్ కేటాయించేందుకు సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) కర్ణ శ్రీనివాస్‌రావు రూ.10 వేలు లంచం డిమాండ్ చేయగా రూ.7 వేలకు ఒప్పందం కుదిరింది. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇన్చార్జి ఆర్ఐ శ్రీనివాస్‌రావు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.