హైదరాబాద్, జులై 17(నమస్తే తెలంగాణ): విజయ డెయిరీ నిర్లక్ష్యం పాడి రైతులకు శాపంగా మారింది. ప్రభుత్వం, డెయిరీ చేసిన తప్పుల కారణంగా పాడి రైతులకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. కొన్ని నెలలుగా విజయ డెయిరీ రైతులకు ప్రభుత్వం పాల బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఆయా రైతులు బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐల చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రుణాలు చెల్లించాలంటూ బ్యాంకులు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నాయి. ‘తీసుకున్న రుణాలు చెల్లించండి. లేదంటే తదుపరి పరిణామాలకు మీరే బాధ్యులు’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ విధంగా చేయని తప్పులకు రైతులు బలికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనగామ జిల్లాలో ఇప్పటికే తొమ్మిది మంది రైతులకు ఒక బ్యాంకు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఈ జిల్లాకు చెందిన రాధిక అనే మహిళా రైతుకు గేదెల కొనుగోలు కోసం ఐడీబీఐ బ్యాంకు నుంచి విజయ డెయిరీ రూ.80 వేల రుణం ఇప్పించింది.
ఇందులో కొంత చెల్లించగా ఇంకా రూ.46,125 చెల్లించాల్సి ఉన్నది. విజయ డెయిరీ నుంచి కొన్ని రోజులుగా పాల బిల్లులు రాకపోవడంతో ఈఎంఐ చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో బ్యాంకు అధికారులు జూన్ 24న ఆమెకు నోటీసులు జారీ చేశారు. తీసుకున్న రుణం చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరంగా ముందుకెళ్తామని, తదుపరి ఘటనలకు పూర్తి బాధ్యత మీదే అంటూ స్పష్టం చేశాయి. ఈవిధంగా చాలామంది రైతులకు ఆయా బ్యాంకులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమ తప్పు లేకున్నా తమపై అప్పు ఎగవేతదారులుగా ముద్ర పడుతున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
డెయిరీ నిర్లక్ష్యం… రుణ ఎగవేతదారులుగా రైతులు
ప్రస్తుతం పాడి రైతులకు విజయ డెయిరీ నుంచి రూ.120 కోట్లకుపైగా పాల బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. ప్రతి పదిహేను రోజులకోసారి బిల్లులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, గత మూడు నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. దీంతో రైతులను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. రుణం చెల్లించకపోవడంతో రైతులను బ్యాంకులు రుణ ఎగవేతదారులుగా ప్రకటిస్తున్నాయి. సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోవడంతో రైతుల సిబిల్స్కోర్పై ప్రభావం పడుతున్నది.
ఇది భవిష్యత్తులో రైతులు రుణం తీసుకోవాలంటే ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉన్నది. దీంతోపాటు గతంలో పదిహేను రోజులకోసారి బిల్లులు రావడంతో ఈ డబ్బులతో ఇంటి అవసరాలు తీర్చుకునేవారు. ఇప్పుడు బిల్లులు రాకపోవడంతో ఇంటి అవసరాలకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం గేదెలకు దాణా కూడా పెట్టలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒకవైపు విజయ డెయిరీ నుంచి బిల్లులు రాకపోవడం, మరోవైపు బ్యాంకులు రుణం చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తుండటంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విజయ డెయిరీ నుంచి తమకే బిల్లులు రావడం లేదని, అలాంటప్పుడు ఈఎంఐలు ఏ విధంగా చెల్లిస్తామంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈఎంఐలు చెల్లించని విజయ డెయిరీ
పాడి రైతులు గేదెల కొనుగోలు చేసేందుకు విజయ డెయిరీ గతంలో పలు బ్యాంకుల నుం చి రుణాలు ఇప్పించింది. ప్రతినెలా రైతులకు రావాల్సిన పాల బిల్లుల నుంచి విజయ డెయిరీనే రైతుల తరపున బ్యాంకులకు ఈఎంఐలు చెల్లిస్తున్నది. నాలుగైదు నెలలుగా రైతులకు పా ల బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతున్నది. గతంలో మాదిరిగా డెయిరీ రైతుల తరుపున బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించలేకపోతున్నది. దీంతో విజయ డెయిరీతో తమకు సంబంధం లేదని, రుణం చెల్లించాలంటూ బ్యాంకులు రైతులపై ఒత్తిడి చేస్తున్నాయి.