రవీంద్రభారతి, జనవరి 22: ఏడాదిలోపే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను పూర్తి చేసి అవి తమవిగా చెప్పుకోవడం సిగ్గుచేటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 65 ఏండ్లకు పెంచే ఆలోచనను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన 23 జిల్లాల్లో వివిధ శాఖల్లో ఏర్పడిన వందలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయసు పెంపుతో ఖాళీ కావాల్సిన 40 వేల ఉద్యోగాలకు గండి పడుతుందని, నిరుద్యోగుల పొట్టకొట్టినట్టు అవుతుందని విమర్శించారు. రాష్ట్రంలో 16లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా బడా కాంట్రాక్టర్లకు వేలాది కోట్ల రూపాయలు దోచిపెడుతున్నదని ధ్వజమెత్తారు.