కాచిగూడ, ఫిబ్రవరి 7: తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 75 కోట్ల మంది బీసీలకు కేంద్ర బడ్జెట్లో కేవలం రూ.2,500 కోట్లను కేటాయించి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని మంత్రికి వివరించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కోరారు. బీసీల సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చినట్టు ఆర్ కృష్ణయ్య తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జనగణనలో కులగణన చేపట్టాలని కోరారు. 75 ఏండ్లయినా బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రాజ్యంగాబద్ధంగా న్యాయం జరడం లేదని, దేశంలోని బీసీలకు రావాల్సిన రాజ్యాంగపరమైన హక్కులను కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అణచివేస్తున్నదని ఆరోపించారు. సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, దుర్గానరేశ్, వేణుమాదవ్, సురేశ్, రాజు, మణికంఠ పాల్గొన్నారు.