మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 02:56:37

ఆయిల్‌పామ్‌ రైతుకు 2,592 కోట్ల సబ్సిడీ

ఆయిల్‌పామ్‌ రైతుకు 2,592 కోట్ల సబ్సిడీ

  • సాగు ఖర్చులో యాభై శాతం సబ్సిడీ
  • నాలుగేండ్లలో ఎకరాకు ఖర్చు రూ.62,340
  • 8.14 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక
  • 1.62 లక్షల మంది రైతులకు లబ్ధి

హైదరాబాద్‌, జనవరి 3, నమస్తే తెలంగాణ: ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. సాగుకయ్యే ఖర్చులో 50 శాతం రైతుకు అందించనున్నది. ఎకరా సాగుకయ్యే ఖర్చు, ప్రభుత్వ సబ్సిడీ, రైతు వాటా తదితర అంశాలపై ఉద్యానశాఖ ఈ మేరకు నివేదికను సిద్ధం చేసింది. ఏటా రెండు లక్షల ఎకరాల చొప్పున వచ్చే నాలుగేండ్లలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు రూ.5,076.15 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందులో రైతువాటా రూ.2,484.17 గా నిర్ణయించగా.. సబ్సిడీ కింద రూ.2,591.98 కోట్లు ఇవ్వనున్నది. సబ్సిడీ మొత్తంలో కేంద్రం వాటా రూ.1,328.24 కోట్లు, రాష్ట్రం వాటా రూ.1,263.75 కోట్లుగా ఉన్నది.

 ఉద్యానశాఖ నివేదిక ప్రకారం.. ఎకరా ఆయిల్‌పామ్‌ సాగుకు నాలుగేండ్లలో రూ.62,340 పెట్టుబడి అవుతుంది. ఇందు లో రైతుకు రూ.31,832 సబ్సిడీ ద్వారా అందనున్నాయి. మొక్కల కొనుగోలు, నాటేందుకు రూ.6,340, ఎరువులకు రూ.16వేలు, అంతర పంటల సాగుకు రూ.16వేలు, డ్రిప్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు రూ.24 వేలు ఖర్చవుతుందని ఉద్యానశాఖ అంచనా వేసింది. చెట్ల మెయింటనెన్స్‌, ఫెన్సింగ్‌, బార్డర్‌ క్రాప్స్‌ పెట్టుకొనేందుకు రూ.77,340 అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది రైతు విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. నాలుగేండ్ల తర్వాత ఎరువుల ఖర్చు మాత్ర మే భరించాల్సి ఉంటుంది. అప్పటికే పంట దిగుబడి మొదలవుతుండటంతో ఇబ్బందులుండవు. సబ్సిడీతో రాష్ట్రంలో 1.62 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నది. 

నాలుగేండ్లు.. 8 లక్షల ఎకరాలు

బహిరంగ మార్కెట్లో భారీ డిమాండ్‌ ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నది. ఇందుకు కేంద్రం కూడా ఆమోదం తెలిపింది.  ఏటా 2.03 లక్షల ఎకరాల చొప్పున  వచ్చే నాలుగేండ్లలో (2024-25 వరకు) రాష్ట్రంలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే జిల్లాలవారీగా 14 కంపెనీలను ప్రభుత్వం ఎంపిక చేసింది.

రైతులకు ఎంతో మేలు

ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు వరం లాంటిది. నిరంతరం.. కచ్చితమైన ఆదాయం అందుతుంది. రైతును ఆదుకొనేందుకు పెట్టుబడి ఖర్చులో 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం  నిర్ణయించింది. ఇందుకనుగుణంగా నాలుగేండ్లలో 8 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళికను సిద్ధం చేశాం. దశలవారీగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి.. సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తాం.

- వెంకట్రామ్‌రెడ్డి, డైరెక్టర్‌ ఉద్యానశాఖ