హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.17 లక్షల వాహనాలు త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 75 వేలకుపైగా వాహనాలు పన్ను చెల్లించలేదని వెల్లడించారు. కొన్ని 3 నెలల కాలపరిమితికి పన్ను చెల్లించాల్సి ఉండగా 80 శాతం వాహనాలు కొవిడ్ కాలం నుంచి పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో వాహనాల నుంచి బకాయిలు రాబట్టేందుకు రవాణాశాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 60 మంది మోటర్ వాహన తనిఖీ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఫిబ్రవరి నుంచి దాదాపు రూ.16 కోట్లు వసూలు చేసింది. స్పెషల్ డ్రైవ్లో ఒక్కో ఎంవీఐ రూ.7 లక్షల వరకు టార్గెట్ సాధించారు. సాధారణంగా వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి త్రైమాసిక పన్ను బకాయి చెల్లిస్తే 50 శాతం జరిమానా విధిస్తారు. కానీ, తనిఖీల్లో పట్టుబడితే 200 శాతం వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.