స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు 66 ఏండ్ల తర్వాత ఆగిపోయాయి. ప్రణాళికాబద్ధ ప్రగతి కోసం తొలి ప్రధాని నెహ్రూ కాలంలో ఆరంభమైన ప్రణాళికల ఆర్భాటం, అమలు 2017లో నిలిచిపోయాయి. ఐదు సంవత్సరాల అభివృద్ధి కోసం ముందే రూపొందించిన ప్రణాళికలు.. లక్ష్యాలను సాధించకపోగా దేశం కొన్ని దశాబ్దాలు వెనుకబడిపోవడానికి దారితీశాయి. భారత్ వంటి అత్యధిక జనాభా ఉన్న విశాల దేశంలో ముందుగా రూపొందించిన ప్రణాళికలను అమలు చేయడం, అనుకున్న ప్రగతి సాధించడం అసాధ్యమని తేలిపోయింది. ఏడున్నర దశాబ్దాల క్రితమే ప్రవేశపెట్టిన ప్రణాళికల వల్ల నష్టమే తప్ప లాభం లేదని చాలాకాలం కిందటే స్పష్టమైంది.నెహ్రూ కాలం నుంచి 1990ల వరకూ వనరుల కొరత, అవినీతి, పథకాల అమల్లో అసమర్థత ఈ పంచవర్ష ప్రణాళికలను చరిత్ర గర్భంలో కలిపేశాయి. భారీ ప్రచారం,ఆర్భాటంతో మొదలుపెట్టిన ఐదేండ్ల ప్రణాళికలు మూలనపడటానికి ఇంకా చాలా కారణాలున్నాయి.
1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు కాలంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలతో పంచవర్ష ప్రణాళికలకు కాలం చెల్లినట్టయింది. చివరి, 12వ ప్రణాళిక అమలు 2017లో ముగిసిన తర్వాత ప్రస్తుత మోదీ సర్కార్ ప్రణాళికా విధానానికి మంగళం పాడింది. కేవలం ఐదు సంవత్సరాల భవిష్యత్తు అభివృద్ధి కోసం రూపొందించి, అమలు చేసే ప్రణాళికలే విఫలమైన అనుభవం భారత పాలకులకు విస్తారంగా లభించింది. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, బీజేపీ రెండో ప్రధాని మోదీ తమ ‘విజన్’ను ఐదు నుంచి దాదాపు 20 సంవత్సరాలకు అటూఇటూగా పెంచేసి విజన్ డాక్యుమెంట్లు రూపొందించి జనం మీదకు వదులుతున్నారు. ప్రజలను ఆకట్టుకోవడం, స్వదేశీ, విదేశీ కంపెనీలను రప్పించాలనేది కూడా పాలకుల తాపత్రయం. ఇంకా, తాము అధికారంలో ఉండగా ఈ విజన్లలో చెప్పిన పనులు చేస్తామని, లక్ష్యాలు సాధిస్తామని కూడా ఈ ముఖ్యమంత్రులు, ప్రధాని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు.
వివిధ రాష్ర్టాల్లోని పాలకపక్షాలకు దేశంలో ఆర్థిక సంస్కరణలు, ప్రపంచంలో ఐటీ విప్లవంతోపాటు 1990ల్లో కొత్త ఆలోచనలు వచ్చాయి. 1990 మార్చిలో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మాటలే ఇందుకు ఉదాహరణ. తాను వరుసగా 20 ఏండ్లు అధికారంలో ఉంటానని గద్దెనెక్కిన కొన్నేళ్లకు లాలూ బహిరంగ ప్రకటన చేశారు. అలాగే 1994 సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు తన నాలుగేండ్ల పాలన తర్వాత ఇలాంటి పనే చేశారు. తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాబోయే 20 సంవత్సరాల్లో తాను అందించే ప్రగతి గురించి గణాంకాలతో ‘విజన్ 2020’ పేరుతో ఒక డాక్యుమెంటు విడుదల చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ పేరుతో రాష్ట్ర భవిష్యత్తు కోసం తన అంచనాల ప్రకారం సూచించే 83 పేజీల పత్రాన్ని విడుదల చేశారు.
ఇంతే ఆర్భాటంగా 1998లో ఆయన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు ‘విజన్2020’ పేరుతో 337 పేజీల సమైక్య ఆంధ్రప్రదేశ్ ‘భవిష్యత్ చిత్రాన్ని’ రూపొందించి అందించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఏపీ సీఈవో, హైటెక్ సీఎం వంటి అందమైన బిరుదులు, అంతర్జాతీయ మీడియా ప్రశంసలతో అప్పట్లో చంద్రబాబు ఉచ్ఛ స్థితిలో వెలిగిపోతున్నారు. మరి ఐటీ విప్లవమనే ఇంజిన్‌తో ముందుకు దూకుతున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ చిత్రపటాన్ని రూపొందించడం ఇండియాలో ఎవరి వల్ల కాదనే వాస్తవం గ్రహించిన చంద్రబాబు, ఆ పనిని మెక్కిన్సీ అనే అంతర్జాతీయ కంపెనీకి అప్పగించారు. చంద్రబాబు విజన్‌ను ఈ అమెరికా కంపెనీ అక్షరాల్లో, అంకెలతో రాసి చూపించింది. అప్పటికే పాశ్చాత్య పారిశ్రామిక దేశాలైన అమెరికా, ఇంగ్లండ్ దేశాధినేతలు బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్ వంటి పాలకులు, నిధులు దండిగా సమకూర్చే ప్రపంచ బ్యాంకులు చంద్రబాబుకు చక్కటి ఇమేజీని తెలివిగా సమకూర్చిపెట్టాయి.
ప్రపంచ బ్యాంకు నిపుణులు, మెక్కిన్సీ సృజనాత్మక శక్తితో రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ విజన్-2020’ డాక్యుమెంట్ 1998లో విడుదలైంది. 1999 సెప్టెంబర్‌లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం చంద్రబాబు విజన్ అమలును మాత్రమే గాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా సంక్షోభంలోకి నెట్టివేసింది. 2020-విజన్ అమల్లోకి వచ్చిన నాలుగేండ్లకే అంటే 2002 నాటికే సమైక్య రాష్ట్రంలో జనం తీవ్ర ఆర్థిక ఇబ్బందులపాలయ్యారు. పరస్పర వైరుధ్యాల పుట్ట అయిన బాబు విజన్‌లో పేదలకు ముఖ్యంగా వ్యవసాయ, గ్రామీణరంగాలకు సరైన చోటు లేకపోవడం పెద్ద విషాదం. ఫలితంగా అనావృష్టికి తోడు సర్కారు నుంచి సకాలంలో, సరైన సాయం అందక రైతన్నలు అన్ని చోట్లా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. విజన్ డాక్యుమెంట్లో చెప్పినట్టు చిన్న, మధ్య తరహా పరిశ్రమల యూనిట్లకు తగినన్ని రుణాలు అందే సౌకర్యం లేకపోవడం, భారీ, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన కొత్త విధానాల వల్ల అత్యధిక ప్రజానీకానికి ఉపాధి కల్పించే ఈ చిన్న కంపెనీల మనుగడ కష్టమైంది.
వ్యవసాయంపై ఫోకస్ తగ్గించాలన్న చంద్రబాబు కొత్త విజన్‌తో వ్యవసాయం దండగ అని తెలుగునాట తెలివిగా రుజువు చేశారు. ప్రజలందరికీ విద్య, ఆరోగ్యం అని 2020 విజన్ డాక్యుమెంట్లో చెప్పారు గానీ, కొత్తగా ఏపీలో అమలు చేసిన విధానాలు ప్రైవేటు ఆస్పత్రులకు అనుకూలంగా మారాయి. భారీ ఫీజులు వసూలు చేసే ప్రైవేటు విద్యాసంస్థలకు లాభాలు ఆర్జించిపెట్టే పనిముట్లుగా అవి మారాయి. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి, అతి వేగంతో సాధిస్తున్న అభివృద్ధి పచ్చి మోసమని 2004 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ఓడించడం ద్వారా ప్రజలు నిరూపించారు. ఇలా చంద్రబాబు 20 సంవత్సరాల ప్రగతి కోసం రాయించుకున్న విజన్ ఆరు సంవత్సరాలకే కుప్పకూలిపోయింది. విజన్తోపాటు పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజల బతుకులు ఇబ్బందుల్లో చిక్కుకుపోయాయి.
మళ్లీ పదేండ్ల తర్వాత 2014లో రాష్ట్ర విభజన వరకూ విజన్-2020 ఊసెత్తే వారే లేకుండాపోయారు. తాను తెలుగునాడు బంగారు భవిష్యత్తు కోసం రూపొందించిన విజన్-2020ని గిట్టనివాళ్లు ‘విజన్-420’ అని ముద్ర వేశారని, వాస్తవానికి అది ప్రజలకు ఎనలేని మేలు చేసిందని అవశేష ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో ఏపీలో అధికార పక్షమైన టీడీపీ ఓడిపోయిన తర్వాత 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు మళ్లీ కొత్త విజన్‌తో ముందుకొచ్చారు.
2004, 2009, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమిపాలైన తర్వాత కూడా ప్రజలను మాయచేసి, మభ్యపెట్టే ‘విజన్’పై చంద్రబాబుకు మోజు పోలేదు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు గడిచిన సందర్భంగా 2023 ఆగస్టులో టీడీపీ నేత విశాఖపట్నం వేదికగా కొత్తగా విజన్-2047కు తెరతీశారు. అంతకు కొద్ది మాసాల ముందే తెలంగాణ సాధించిన అధిక తలసరి ఆదాయం, రాజధాని హైదరాబాద్ ప్రగతి గురించి చంద్రబాబు మాట్లాడటం విశేషం. అయితే, తాను ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉండగా చేసిన కృషి వల్లనే ఐటీ రంగం రాష్ట్రంలో బలపడి, తెలంగాణ సంపద పెరిగిందని చెప్పడం ఆయన ఉద్దేశం. అందుకే, నిరంతరం ఆయన తెలంగాణ ప్రగతి గురించి, గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఆవిర్భావం గురించి మాట్లాడేవారు. విశాఖలో విజన్-2047 డాక్యుమెంట్ విడుదలకు ముందు ఆయన ఇలాంటి భవిష్యత్ చిత్రపటాలు చాలా జనం మీదకు వదిలారు. విజన్-2020 తర్వాత 2004లో ఓటమిపాలైనప్పటికీ, 2014లో ఏపీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాక విజన్-2029 అనే కొత్త అంచనా పత్రాన్ని తయారు చేయించారు. తర్వాత దాన్ని 2050 వరకూ పొడిగించి తెలుగు ప్రజల ప్రగతికి గట్టి పునాదులు వేస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత 2023 ఆగస్టులో విజన్-2047 పేరుతో ప్రతిపక్ష నేతగా కూడా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎలాంటి పథకాలు రూపొందించినదీ చంద్రబాబు వెల్లడించారు.
తన కలల నగరంలో ఏర్పాటు చేసిన ఆర్థిక సమ్మిట్‌లో ‘తెలంగాణ రైజింగ్-2047’ పేరుతో ఇటీవల తాజా విజన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎన్నడూ లేనంత ప్రచారం, ఆర్భాటం చేశారు. తన రాజకీయ గురువు బాటలో తెలంగాణకు కొత్త విజన్‌తో రూపొందించిన పథకాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో ఆర్థికవేత్తలకు ఊహించడం కష్టం కాదు. తరచు తాను మొత్తం పదేండ్లు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటానని వేదికలపై, ఇంటర్వ్యూల్లో ప్రకటించిన రేవంత్ విజన్ పేరుతో పాత మార్గంలో పయనిస్తూ చేసిన హడావుడి కనీసం పెట్టుబడులను ఆకర్షిస్తుందా? అంటే చెప్పడం కష్టమంటున్నారు. 200 బిలియన్ డాలర్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తమ పాలనలో 2034 నాటికి లక్ష కోట్ల డాలర్లకు పెరుగుతుందని, మరో 22 ఏండ్లలో అంటే 2047 నాటికి మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని విజన్-2047 డాక్యుమెంటులో అంచనా వేశారు. రాబోయే రోజుల్లో పది కీలక వ్యూహాలతో తెలంగాణ ఈ లక్ష్యాలు సాధిస్తుందనే ధీమాతో ముఖ్యమంత్రి ఉన్నారు. అయితే, విజన్ విషయంలో చంద్రబాబు మార్గాన్ని ఎంచుకున్న రేవంత్‌రెడ్డి ఇంగ్లిష్ భాష వాడకం విషయంలో మాత్రం సొంత బుర్రతో మాట్లాడుతున్నారనిపిస్తున్నది. ‘జపాన్, జర్మనీల్లో ఇంగ్లిపీసు ఎవరికీ రాదు. ఇంగ్లిష్ రాకుండానే ఈ రెండు దేశాలూ ఎనలేని అభివృద్ధి సాధించాయి. కాబట్టి, ఇంగ్లిష్ రాదనే దిగులు వద్దు’ అంటూ ఈ మధ్య యూనివర్సిటీ విద్యార్థులకు తెలంగాణ సీఎం సలహా ఇచ్చారు. ఇంగ్లిష్ నేర్చుకోవడం సంగతి పక్కనబెట్టి ఆలోచిస్తే… అసలు తెలంగాణ రైజింగ్ విజన్ ఎలా పట్టాలెక్కి ముందుకు సాగుతుంది? అనే ప్రశ్న అందరినీ కలచివేస్తున్నది.
తన కలల నగరంలో ఏర్పాటు చేసిన ఆర్థిక సమ్మిట్‌లో ‘తెలంగాణ రైజింగ్-2047’ పేరుతో ఇటీవల తాజా విజన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎన్నడూ లేనంత ప్రచారం, ఆర్భాటం చేశారు. తన రాజకీయ గురువు బాటలో తెలంగాణకు కొత్త విజన్‌తో రూపొందించిన పథకాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో ఆర్థికవేత్తలకు ఊహించడం కష్టం కాదు.
-నాంచారయ్య మెరుగుమాల