హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘నమ్మినానబోస్తే.. పుచ్చిబుర్రలైనట్టుగా..’ ఉంది కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) తీరు. ఏదో చేస్తుందని అధికారం కట్టబెడితే ఏమీ చేయలేక చతికిలపడింది. రేవంత్ (Revanth Reddy) సర్కార్ నిర్లక్ష్యంతో ఊర్లన్నీ గోడువెల్లబోసుకుంటున్నాయి. తెలంగాణలో (Telangana) పల్లె ప్రగతి (Palle Pragathi) పడకేసింది. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం గ్రామ సమస్యగా మారింది. ఒకప్పుడు జాతీయస్థాయి అవార్డులు, పచ్చదనంతో కళకళలాడిన గ్రామాలు నేడు పారిశుద్ధ్యలోపంతో, నిధుల కొరతతో కునారిల్లుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినా, అభివృద్ధిని గాలికి వదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘మా ఊరు మారుతుంది’ అని ఆశపడ్డ జనం, ఇప్పుడు ‘ఊరు కంపుకొడుతున్నది’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిలిచిపోయిన నిధులు
కాంగ్రెస్ సర్కారును నమ్మి ఓటేస్తే పల్లె ప్రగతిని పట్టించుకోవడం లేదని జనం వాపోతున్నారు. 2023 ఫిబ్రవరిలో గ్రామ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదు. 2024-25 సంవత్సరంలో రూ.1,514 కోట్లు నిలిచిపోయాయి. 2025-26లో రూ.1,477 కోట్లూ ఆగిపోయాయి. ఒకవైపు కేంద్రం నిధుల మంజూరులేక, మరోవైపు రాష్ట్ర సర్కార్ నిధులు ఇవ్వక పల్లెసీమల్లో అభివృద్ధి అటకెక్కింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు మ్యాచింగ్ గ్రాంట్లు లేకనో, ఇతర కారణాలతోనే గ్రామాలకు చేరడం లేదని మాజీ సర్పంచ్‌లు వాపోతున్నారు.
దయనీయంగా గ్రామజీవనం
గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తమైంది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా, చెత్త కుప్పలు పేరుకుపోతున్నా పట్టించుకునే వారే లేరు. బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా పంచాయతీల ఖాతాల్లో డబ్బులు లేని దయనీయ పరిస్థితి. కేసీఆర్ హయాంలో ప్రతి పల్లెకూ ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఇచ్చి నిత్యం పారిశుద్ధ్యం నిర్వహించగా, నేడు డీజిల్ పోయించే దికులేక అవి షెడ్లకే పరిమితమయ్యాయి. వీధిలైట్ల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేయడంతో పల్లెలు చీకట్లో మగ్గుతున్నాయి. బిల్లులు కట్టలేదని విద్యుత్‌శాఖ సిబ్బంది కనెక్షన్లు కట్ చేస్తుంటే, సాయంత్రమైతే చాలు భయంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
కేసీఆర్ పాలనలో పల్లె పరవశం
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రతి పల్లె పరవశించింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా కేసీఆర్ సర్కారు 24 శాతం ఉన్న గ్రీన్‌కవర్‌ను 33 శాతానికి పెంచింది. 12,756 గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు స్వాగత తోరణాలుగా మారాయి. రాష్ట్రంలో 7.7 శాతం ఫారెస్ట్ కవర్ పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రతి గ్రామానికీ వైకుంఠధామాలు, క్రీడాప్రాంగణాలు, సెగ్రిగేషన్ షెడ్లు ఏర్పాటయ్యాయి. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 42 లక్షల ఇండ్లలో టాయిలెట్ల నిర్మాణం జరిగింది. 2019లో రాష్ట్రంలోని 12,769 గ్రామాలను బహిరంగ మలవిసర్జనరహితాలుగా గుర్తించారు. పారిశుద్ధ్య నిర్వహణ క్రమం తప్పకుండా చేపట్టారు. పాత ఇండ్ల కూల్చివేత, పాతబావుల పూడ్చివేత, డ్రైనేజీల క్లీనింగ్ రోజూ జరిగేది. డంపింగ్‌యార్డుల ద్వారా వర్మికంపోస్టు తయారుచేశారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందింది. సీసీరోడ్ల ఏర్పాటు, డ్రైనేజీ అవసరమైన చోట్ల నిర్మాణాలు జరిగాయి. కేసీఆర్ సర్కారు కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటుచేయడంతో వాటికి భవన నిర్మాణాలు కూడా జరిగాయి. రైతు వేదికలు, క్రీడాప్రాంగణాలూ ఏర్పాటుచేశారు. పల్లెప్రాంతాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేశారు. విద్యుత్తు వ్యవస్థను ఆధునీకరణ, ఈ గవర్నెన్స్ సేవలు అందించడమే కాక ముక్రాకే వంటి గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలూ పెట్టారు.
నేడు గ్రామీణ పల్లెల్లో అస్తవ్యస్తం
కేసీఆర్ పాలనలో పల్లెలు ప్రగతి దిశగా పరుగులు పెట్టగా కాంగ్రెస్ పాలనలో అంతా అస్తవ్యస్తంగా మారింది. పారిశుద్ధ్యం పడకేసింది, సిబ్బందికి వేతనాలు చెల్లించలేని దయనీయం రేవంత్ సర్కార్‌ది. అభివృద్ధి కోసం నాడు సర్పంచులు చేసిన పనుల బిల్లులకు నేటికీ కాంగ్రెస్ సర్కార్ క్లియర్ చేయడం లేదు. ప్రత్యేక అధికారుల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో కనీసం వసతులు సమకూర్చలేక కార్యదర్శులు చేతులేత్తేశారు. చాలాచోట్ల డీజిల్‌కు డబ్బులు లేక ట్రాక్టర్లను మూలకు పడేశారు. ఇప్పటికీ ప్రభుత్వం ఒక్కో పంచాయతీ కార్యదర్శికి రూ.1-2 లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. రెండేండ్లుగా ప్రభుత్వం మోసం చేస్తున్నదని గ్రామీణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అభివృద్ధి విస్మరించిన ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారు, ముందున్న ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారు.
అప్పుడు అవార్డుల పంట.. ఇప్పుడు ఆదరణే కరువు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన’ వంటి అనేక అవార్డుల్లో సింహభాగం తెలంగాణ పల్లెలే దకించుకున్నాయి. పచ్చదనం, పరిశుభ్రత, తాగునీరు వంటి అంశాల్లో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. టాప్ 20 ఉత్తమ గ్రామాల్లో 19 తెలంగాణ నుంచే ఉండేవి. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఆ వైభవం కనుమరుగైంది. రెండేండ్లయినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రజాప్రతినిధులు లేక, స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాలకు ఆదరణే కరువైంది. అదనపు బాధ్యతలతో అధికారులు పట్టించుకోకపోవడంతో చిన్న సమస్య వచ్చినా చెప్పుకోవడానికి ఎవరూ అందుబాటులో లేక జనం అరిగోసపడ్డారు.