హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో 2.16 లక్షల మంది ఆసరా పింఛన్లను సర్కార్ రద్దు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పింఛన్ల సొమ్ము పెంపు హామీని ఈ ప్రభుత్వం విస్మరించిందని, కొత్తగా దరఖాస్తులు చేసుకున్న లక్షలాది మందికి ఇంతవరకూ ఆసరా పింఛన్లను మంజూరు చేయలేకపోతున్నదని గురువారం ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చాక పాతరేసిందని మండిపడ్డారు. నయవంచనే కాంగ్రెస్ సర్కారు నైజమని నిరూపితమైందని తెలిపారు. ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న 24.85 లక్షల మంది ఎదురు చూస్తున్నారని తెలిపారు. పింఛన్ల కోసం బడ్జెట్లో కేటాయించిన రూ.4,000 కోట్ల నిధులు దారిమళ్లాయని ఆమె విమర్శించారు. పింఛన్ల నిధులను దారి మళ్లించడం అంటే పేదల నోటికాడి కూడు లాక్కోవడమేనని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం పేదలను దోచి, పెద్దలకు సద్ది కడుతున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి మనసు, మానవత్వం ఉంటే ఆసరా పింఛన్ లబ్ధిదారులపై ఇంత నిర్దయగా వ్యవహరించదని పేర్కొన్నారు.