నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 15 : సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సోమవారం ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఇండ్ల వద్ద ధర్నాలు చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం 19న చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు.
అంగన్వాడీ టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని, రూ.5వేల పింఛన్ ఇవ్వాలని, జీవో 10 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ సర్కార్ టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. డిమాం డ్లు నెరవేర్చకుంటే 19న శిశు సంక్షేమ శాఖ కా ర్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఎక్కడికక్కడ ముట్టడి
సీఐటీయూ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి ఇంటిని, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ క్యాంప్ కార్యాలయాలను ముట్టడించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు బొల్లం అశోక్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ఇంటిని ముట్టడించి, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకురాలు శ్రీలతకు వినతిపత్రం అందజేశారు.
అంగన్వాడీ వరర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు గండి శైలజ, పసుల స్వరూప పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ యూనియన్ జిల్లా కార్యదర్శి స్నేహబిందు ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే మురళీనాయక్ క్యాంపు ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ భగవాన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
అసెంబ్లీలో లేవనెత్తుతాం..
సీఐటీయూ నాయకులు నాగన్న, దుర్గారావు, తిరుపతమ్మ, మంగమ్మ, సలీమా, వీరలక్ష్మి పాల్గొన్నారు. నిజామాబాద్‌లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్తాకు అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు వినతిపత్రం అందజేయగా, సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బాల్కొండ ఎమ్మె ల్యే ప్రశాంత్‌రెడ్డిని వేల్పూర్‌లో కలిసి వినతిప త్రం సమర్పించారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో వినతిపత్రం అందజేశా రు. ‘భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల(ప్రజాభవన్) వద్ద అంగన్వాడీలు ధర్నాకు దిగారు. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భద్రాచ లం, అశ్వారావుపేట, ఖమ్మం, పాలేరు, మధి ర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజాభవన్లను ముట్టడించి వినతిపత్రాలు అందజేశారు.
అంగన్వాడీ యూనియన్ (సీఐటీయూ) మంచిర్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భానుమతి, రాజమణి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ తీసి ముగ్గు రు ఎమ్మెల్యేల ఇండ్ల ఎదుట ధర్నా చేశారు. కాగజ్‌నగర్ లో సర్‌సిల్క్ కాలనీలోని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఇంటి ఎదుట ధర్నా చేసి, మాజీ జడ్పీటీసీ పాల్వాయి సుధాకర్‌రావుకు వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎదుట ధర్నా నిర్వహించారు.