Road Accidents | హైదరాబాద్, మార్చి5 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. మితిమీరిన వేగంతో ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, అమాయకుల ప్రాణాలు సైతం బలిగొంటున్నారు. ఏటా రోడ్డు ప్రమాద బాధితులు పెరుగుతూనే ఉన్నారు. మరణాల సంఖ్య విస్తృతంగా పెరుగుతున్నది. వేగంలో ఉన్న థ్రిల్ కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన లెక్కలు పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2022లో మన రాష్ట్రంలో ఎంవీ చట్టం కింద 1,65,84,388 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ప్రధానంగా 19,456 రోడ్డు ప్రమాదాలు జరుగగా 6,746 మంది చనిపోయారు. సుమారు 18,413 మంది తీవ్రగాయాలపాలయ్యారు. గత నాలుగేండ్లలో కేవలం రోడ్డు ప్రమాదాల ద్వారానే 26,433 మంది మృత్యు ఒడిలోకి చేరుకోగా 75,319 మంది వైకల్యం పాలయ్యారు. వీటిల్లో ఎక్కువ శాతం ప్రమాదాలు రాష్ట్రంలోని జాతీయ రహదారులపై జరిగినట్టు పోలీసు నివేదికలు చెబుతున్నాయి.
డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలపై రాష్ట్ర పౌరులకు తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. వాహనదారులు నిర్లక్ష్యాన్ని వీడి జాగ్రత్తగా ప్రయాణించాలని ప్రతి ఏటా పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నది. 2022లో ఒక్క హైదరాబాద్లోనే 406 పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లోని 76,997 మంది విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
పల్లెలు మొదలు, పట్టణాల్లో కూడా వాహనదారులు హెల్మెట్ ధరించడం లేదు. కార్లు నడిపేవారు సీట్ బెల్ట్లు పెట్టుకోవడం లేదు. అతి విశ్వాసంతో వాహనాలను నడుతుపున్నారు. కొందరు ఫూటుగా తాగి వాహనాలను నడుపుతున్నారు. ఈ నిర్లక్ష్యానికి అతివేగం తోడుకావటంతో రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. వాహనం నడిపేవారు ప్రమాదానికి గురికావడంతో పాటు ఎదురుగా వస్తున్నవారు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డుప్రమాదంలో ఏ ఒక్కరు చనిపోయినా ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతున్నది. కుటుంబంలో అర్జించేవారు ప్రమాదంలో మరణిస్తే, పిల్లలు చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఎవరిని నిందించాలో తెలియని పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు గోసపడుతున్నాయి.