భర్త రాక కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ.. ముగ్గురు కుమార్తెలను పట్నం లోని కాలేజీలకు పంపుతూ వీడ్కోలు చెప్పిన తండ్రి.. అందరి ఆశలు ఛిద్రమయ్యాయి. తాండూరు నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ మృత్యు శకటమై కబళించింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా 19 మంది దుర్మరణం పాలయ్యారు.
రంగారెడ్డి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) షాబాద్/చేవెళ్ల రూరల్/చేవెళ్ల టౌన్: తెల్లవారక ముందే బస్సెక్కిన 19 మంది ప్ర యాణికుల బతుకులు తెల్లారేలోగా కానరానిలోకాలకు (Chevella Accident) మరలిపోయాయి. గమ్యస్థానాలకు చేరుకోక ముందే తమ వారికి దూరమయ్యా రు. క్షేమంగా వెళ్లొచ్చని ఆర్టీసీ బస్సు ఎక్కిన వారికి కంకర టిప్పర్ రూపంలో మృత్యుశకటం ఎదురొచ్చి ప్రాణాలనే బలి తీసుకున్నది. నిద్రలో ఉన్నవారు కొందరు శాశ్వత నిద్రలోకి జారిపోయారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురై 19 మంది సజీవదహనమైన ఘటనను మరువకముందే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ గేట్ వద్ద సోమవారం తెల్లవారుజామున మరో ఘోర రోడ్డు ప్రమా దం జరిగింది.
ఈ దుర్ఘటనలో టిప్పర్, బస్సు డ్రైవర్లు ఇద్దరు సహా 19 మంది దుర్మరణం పాలయ్యారు. తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును అతివేగంగా వచ్చిన కంకర టిప్పర్ బలంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నది. వికారాబాద్ జిల్లా తాండూరు డిపో ఆర్టీసీ బస్సు (టీఎస్ 34టీఏ6354) తాండూరు నుంచి తెల్లవారుజామున 4:30 గంటలకు 30 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. మార్గంమధ్యలో వికారాబాద్ తదితర బస్టాప్‌లలో ఎక్కిన వారితో కలిపి మొత్తం 72 మంది ప్రయాణికులతో వెళ్తున్నది. చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ గేట్ సమీపంలోని హైదరాబాద్-బీజాపూర్ హైవేపై చేవెళ్ల నుంచి వికారాబాద్‌కు కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ (టీజీ 06టీ3879) వాహనం ఎదురుగా అతి వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టి, దానిపై పూర్తిగా ఒరిగిపోయింది.
దానిలో ఉన్న కంకరమొత్తం బస్సులోకి జా రింది. దీంతో ఆర్టీసీ బస్సు కుడివైపున 8 వరుసల సీట్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఆ సీట్లలో కూర్చున్న కొందరు ప్రయాణికులు బలమైన గాయాలతో మరణించగా, మరికొందరు కంకరలో కూరుకుపోయి ఊపిరాడక వి లవిల్లాడుతూ చనిపోయారు. బస్సు డ్రైవర్‌తోపాటు టిప్పర్ డ్రైవర్ కూడా దుర్మరణం చెం దారు. వీరితోపాటు 17 మంది ప్రయాణికు లు ప్రాణాలొదిలారు. మృతుల్లో 12 మంది మహిళలు ఉండగా, ఆరుగురు పురుషులు, 10 నెలల చిన్నారి ఉన్నారు. మరో 25 మంది కి తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, బస్సు పై పడిన టిప్పర్‌ను క్రేన్ సహాయంతో తొలగించి, మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. 14 మందిని చేవెళ్లలోని ప్రభుత్వ, పీఎంఆర్ దవాఖానలకు తరలించగా, మిగతా వారిని హైదరాబాద్‌లోని వివిధ దవాఖానలకు తరలించారు.

మరణించిన వారి కుటుంబసభ్యులు తాం డూరు, హైదరాబాద్‌తోపాటు ఆయా ప్రాంతాల నుంచి చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు చేరుకున్నారు. దవాఖాన ఆవరణలో వారి ఆర్తనాదా లు మిన్నంటాయి. చనిపోయిన తమ వారిని తలుచుకొని కన్నీరుమున్నీరుగా విలపించసాగారు. 19 మృతదేహాలకు రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి సమక్షంలో ప్రత్యేక వైద్యబృందాలు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాల ను కుటుంబసభ్యులకు అప్పగించారు. మధ్యా హ్నం 3 గంటల్లోగా పోస్టుమార్టం పూ ర్తిచేసిన అధికారులు.. అంబులెన్స్‌ల ద్వారా వారి స్వగ్రామాలకు మృతదేహాలను తరలించారు.
మరో గంటలో గమ్యం చేరుకుంటామని ప్రయాణికులు భావిస్తున్న తరుణంలో టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యుశకటం 19 మందిని బలి తీసుకున్నది. తెల్లవారుజామున ప్రమా దం జరగడంతో పలువురు ప్రయాణికులు నిద్రలోనే ఉన్నారు. టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో నిద్రలో ఉన్న వారు కంకరలో మునిగిపోయి ఊపిరాడక శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. మెలకువగా ఉన్నవారు కొందరు ఊపిరాడక, తీవ్రగాయాలతో ఇంకొందరు దుర్మర ణం చెందారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారంతా అనంతలోకాలకు వెళ్లిపోయా రు. మరణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు, తండ్రీకొడుకులు ఉన్నారు.
తాండూర్‌కు చెందిన ట్రావెల్స్ యజమాని ఎల్లయ్యగౌడ్ ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ప్రథమ), సాయిప్రియ (డిగ్రీ తృతీయ), తనూష (ఎంబీఏ) మృతిచెందారు. ఇటీవల తాండూరులో జరిగిన బంధువుల వివాహంలో పాల్గొని తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో మృత్యువాతకు గురయ్యారు. తాండూరుకు చెందిన షేక్ ఖలీల్ హుస్సేన్, తాలియా బేగం, 10 నెలల చిన్నారి మృతిచెందారు. ప్రమాదంలో మరణించిన వారంతా తాండూరు, సమీప గ్రామాలకు చెందిన వారితోపాటు హైదరాబాద్ బోరబండవాసులుగా గుర్తించారు.
చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలో పొన్నం ప్రభాకర్‌తోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, రాంమోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి మృతదేహాలను పరిశీలించి, బాధిత కుటుంబాలతో మా ట్లాడి ఓదార్చారు. అనంతరం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు, ఆర్టీ సీ నుంచి రూ.2 లక్షల చొపున పరిహారం అం దిస్తామని ప్రకటించారు.
క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారంతోపాటు మెరుగైన వైద్యసేవలను అందిస్తామని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. కోటి చొప్పున పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బాధిత కుటుంబాలు మంత్రులను కోరారు. బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్, కేఎస్ రత్నం, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పట్లొళ్ల కార్తీక్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ తదితరులు పరామర్శించారు.
మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థికసాయం అందజేస్తామని ప్రధాని ప్రకటించారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన 19 మందికి సోమవారం ఒక ప్రకటనలో ఆయన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలువాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొని 19 మంది దుర్మరణం చెందడం, పలువురు గాయపడిన ఘటన తనను కలిచి వేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పకటనలో తెలిపారు. వారి మృతికి సంతాపం తెలుపుతూ, వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తంచేశారు. ఘటనపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, నామా
నాగేశ్వర్ విచారం వ్యక్తంచేశారు.
1) కల్పన (42) – బోరబండ
2) తారీప్ (44) యాలాల
3) గుర్రాల అఖిల (23) – యాలాల
4) నాగమణి (54) -యాలాల
5) గున్నమ్మ (60) – బోరబండ
6) హనుమంతు(44) – దౌల్తాబాద్
7) కాలేద్ (43) -తాండూరు
8) తబుసమ్ జహన్ (38) – తాండూరు
9) నందిని (22) – తాండూరు
10) దస్తగిరి బాబా (31) – బస్సు డ్రైవర్
11) వెంకటమ్మ (21) -తాండూరు
12) లక్ష్మి (40) – యాలాల
13) సెలేహా (20) – తాండూరు
14) ఫాతిమా (40 రోజులు) – తాండూరు
15) బందెప్ప 42 – యాలాల
16) ముస్కాన్ బేగం (21) తాండూరు
17) ఆకాశ్ దనియాకమాల్ (24) టిప్పర్ డ్రైవర్, మహారాష్ట్ర
18) సాయిప్రియ (18) – తాండూరు
19) తనూష (20) – తాండూరు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేట్ సమీపంలోని హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ప్రమాద స్థలి వద్ద రోదిస్తున్న మృతుల కుటుంబీకులు

బస్సులో కంకరలో కూరుకుపోయిన ప్రయాణికురాలు, ఘటనలో మృతిచెందిన 40 రోజుల చిన్నారి జహీరా ఫాతిమా