కరీంనగర్ కలెక్టరేట్, నవంబర్ 22: బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి ఆరు రోజులకే అమ్మకానికి పెట్టింది. హైదరాబాద్‌లో డీల్ కుదుర్చుకొని కరీంనగర్లో సేల్ చేస్తుండగా, అధికారులు పట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో భీమిలికి చెందిన ఓ యువతి భర్త వదిలేయడంతో హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లిలోని శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేస్తున్నది. అక్కడ పరిచయమైన ఓ యువకుడు ప్రేమిస్తున్నట్టు చెప్పడంతో నమ్మి దగ్గరైంది. యువతి గర్భం దాల్చడంతో సదరు యువకుడు ముఖం చాటేశాడు. అప్పటికే ఆరు నెలలు దాటగా గర్భం తొలగించే పరిస్థితిలేక పోయింది. ఈ నెల 14న హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో మగ శిశువుకు జన్మనిచ్చింది. కుటుంబంలో తెలిస్తే పరువు పోతుందని భయపడి బిడ్డను విక్రయించేందుకు సిద్ధపడింది.
మధ్యవర్తుల ద్వారా గన్నేరువరం మండలం చాకలివానిపల్లెకు చెందిన రాయమల్లు -లతకు రూ.8లక్షలకు బిడ్డను విక్రయించడానికి ఒప్పందం చేసుకుంది. శిశువును అప్పగించి డబ్బులు తీసుకునేందుకు గురువారం హైదరాబాద్ నుంచి నలుగురు మధ్యవర్తులతో కలిసి కరీంనగర్‌లోని బైపాస్‌రోడ్డుకు చేరుకుంది. డబ్బులు తీసుకుని శిశువును అప్పగిస్తూ తల్లి రోదిస్తుండటంతో రోడ్డుపై వెళ్తున్న ఓ వాహనదారుడు అనుమానించి 1098కు ఫోన్ చేశాడు. వెంటనే స్పందించిన అధికారులు పోలీసులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని కారులో పసిగుడ్డుతో పాటు ఉన్న నలుగురు వ్యక్తులను ఠాణాకు తరలించి కేసు నమోదు చేశారు. శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించగా, బాలసదన్‌లో సంరక్షిస్తున్నారు. శిశువు విక్రయంలో 18 మంది మధ్యవర్తులుగా ఉన్నట్టు తేలిందని, శుక్రవారం వరకు 16 మందిని అదుపులోకి తీసుకున్నామని, ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.